దళిత మహిళపై ఇంత దాష్టీకమా..?:KTR
షాద్‌నగర్‌లో నగల దొంగతనం కేసులో దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.దళిత మహిళపై ఇంత దాష్టీకమా..? ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన?.. దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? మహిళా అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా అంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు.
దొంగతనం కేసులో కొడుకు ముందే తల్లిని చిత్ర హింసలు పెడతారా.. రక్షించాల్సిన పోలీసులతోనే రక్షణ లేని పరిస్థితి, అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది. మహిళలంటే ఇంత చిన్న చూపా.. ఓ వైపు మహిళలపై అత్యాచారాలు, అవమానాలు మరోవైపు దాడులు, దాష్టీకాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. అలాగే యథా రాజా తథా ప్రజా అన్నట్లు ముఖ్యమంత్రే స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తుంటే.. పోలీసులు మాత్రం మేమేమీ తక్కువ అన్నట్టు వ్యవహరిస్తున్నారన్నారు. అలాగే షాద్ నగర్ లో దళిత మహిళపై పోలీసులు వ్యవహరించిన తీరుపై. బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. వెంటనే ఈ దాడికి పాల్పడిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని.. బాధిత మహిళలకు న్యాయం చేయాలని కేటీఆర్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.