ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలో భారతీయుడు.. పట్టించిన వారికి రూ. 2 కోట్ల రివార్డు!
గుజరాత్ లోని విరాంగామ్‌కు చెందిన భద్రేశ్ పటేల్ కోసం ఎఫ్‌బీఐ వెతుకులాట
2015 ఏప్రిల్‌లో మేరీల్యాండ్‌లో భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు
2017 నుంచి అతని కోసం వెతుకుతున్న ఎఫ్‌బీఐ
భారతీయ వ్యక్తి భద్రేశ్‌కుమార్ చేతన్‌భాయ్ పటేల్‌ను అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) తన మోస్ట్ వాంటెడ్ జాబితాలోకి చేర్చింది. ఈ సందర్భంగా అతని ఆచూకీ చెప్పిన వారికి ఎఫ్‌బీఐ 2,50,000 డాలర్ల (భారతీయ కరెన్సీలో రూ. 2.05 కోట్లు) రివార్టు ప్రకటించింది. అతని కోసం 2017 నుంచి ఎఫ్‌బీఐ వెతుకుతోంది. గుజరాత్ లోని విరాంగామ్‌కు చెందిన భద్రేష్ పటేల్ (26).. 2015 ఏప్రిల్‌లో మేరీల్యాండ్‌లో తన భార్య పలక్‌ను హత్య చేసిన కేసులో నిందితుడు. ఈ క్రమంలోనే పటేల్‌ను టాప్ 10 మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చిన ఎఫ్‌బీఐ అతనిపై 2,50,000 డాలర్ల రివార్డు ప్రకటించింది.
మేరీల్యాండ్ హనోవర్‌లోని డంకిన్ డోనట్స్ స్టోర్‌లో భద్రేశ్ పటేల్ తన భార్యను విచక్షణారహితంగా కొట్టి చంపేశాడు. ఈ నేరానికి గాను 2015 ఏప్రిల్ 13న మేరీల్యాండ్ డిస్ట్రిక్ట్ కోర్టు అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అంతేగాక భారత సంతతికి చెందిన మానవ అక్రమ రవాణా ముఠా ద్వారా భద్రేష్ పటేల్ అక్రమంగా కెనడాలోకి ప్రవేశించినట్లుగా గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 20, 2015న యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్, డిస్ట్రిక్ట్ ఆఫ్ మేరీల్యాండ్, బాల్టిమోర్ కోర్టులు అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశాయి.
అప్పటి నుంచి పటేల్ కోసం మేరీల్యాండ్ పోలీసులు వెతికారు. కానీ, వారికి చిక్కలేదు. దాంతో ఈ కేసును 2017లో ఎఫ్‌బీఐకి అప్పగించారు. అప్పటి నుంచి ఎఫ్‌బీఐ అతడి కోసం వెతుకుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల భద్రేష్ పటేల్ పేరును తన మోస్ట్ వాంటెడ్ జాబితాలోకి చేర్చడం, భారీ రివార్డు ప్రకటించడం జరిగింది. కాగా, స్వదేశానికి తిరిగి వెళ్లిపోదామని భార్య పలక్ ఒత్తిడి చేయడంతో పటేల్ ఆమెను అతి కిరాతకంగా హతమార్చినట్లు సమాచారం.