SAKSHITHA NEWS

బీఆర్ఎస్ ఆందోళనతో పార్లమెంట్ లో ప్రతిష్ఠంభన

జేపీసీ వేసి, నిజాలు తేల్చాల్సిందే : నామ నాగేశ్వరరావు

స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలతో ఆందోళన

పార్లమెంట్ లో వాయిదాల పర్వం

గాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డులతో నినాదాలు చేస్తూ బీఆర్ఎస్, విపక్ష ఎంపీల ధర్నా

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

అదానీ అంశంపై జేపీసీ వేసి ,నిజాలు తేల్చాల్సిందేనని బీఆర్ఎస్, విపక్ష సభ్యుల మొండి పట్టు పట్టడంతో శుక్రవారం పార్లమెంట్ లో తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది. దీంతో పార్లమెంట్ సమావేశాలు బీఆర్ఎస్ ఎంపీల ఆందోళనతో సోమవారానికి వాయిదా పడ్డాయి. నామ నాగేశ్వరరావు నాయకత్వం లో బీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళన నిర్వహించడంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
పార్లమెంట్ వాయిదా అనంతరం విపక్ష ఎంపీల మద్దతుతో బీఆర్ఎస్ ఎంపీలు గాంధీ విగ్రహం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్లకార్డులతో
ధర్నా చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా , మోడీ అలసత్వాన్ని నిరసిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మోదీ డౌన్ డౌన్.. ఎల్ఐసీని కాపాడాలి… అదానీ అవకతవకలపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కొనసాగించారు. ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ అదానీ అంశంపై జేపీసీ వేసి, పార్లమెంట్ లో చర్చకు అనుమతించేంత వరకు అవిశ్రాంతంగా మా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.అదానీ – హిండెన్ బర్గ్ అంశంపై తక్షణమే సంయుక్త పార్లమెంటరీ కమిటీని వేసి, నిజాలు నిగ్గు తేల్చాలి డిమాండ్ చేశారు.
మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని దుయ్యబట్టారు.


ప్రజా ప్రతినిధులమంతా దేశ రాజధానిలో న్యాయం కోసం రోడ్ల మీదకు వచ్చి ఉద్యమిస్తుంటే ప్రధాని మోడీ తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటం దారుణమని నామ అన్నారు.
ప్రజా ప్రాముఖ్యత ఉన్న అదానీ అంశంపై చర్చ జరపాలని దేశంలోని మెజార్టీ ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు.ఎంపీల ఆందోళనల నేపధ్యంలో పార్లమెంట్ సాక్షిగా వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రధాని మోడీ కి ఉందన్నారు.
ఇప్పటికైనా ప్రధాని మోడీ స్పందించి వాస్తవాలు ప్రజలముందుంచి, ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.


SAKSHITHA NEWS