SAKSHITHA NEWS

అంతా అక్రమమే

ఆంధ్ర నుండి తెలంగాణకు అక్రమ ఇసుక రవాణా

లారీలకు పర్మిట్ లేవు వేబిల్లులు లేవు

తెలంగాణ ఆదాయానికి గండి కొడుతున్న ఆంధ్ర ఇసుక

చోద్యం చూస్తున్న మైనింగ్ రవాణా శాఖ అధికారులు

మధిర మార్చి 17 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా మాగల్లు నుండి మధిర మీదగా ఖమ్మం జిల్లా కేంద్రానికి ప్రతిరోజు వందల లారీల్లో అక్రమంగా ఇసుక రవాణా అవుతుంది. దీనిని అరికట్టాల్సిన అధికారులు నిద్ర నటించడంతో ఇసుక మాఫియా పెట్రేగిపోతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆంధ్ర నుండి తెలంగాణకు ఇసుకకు అనుమతి లేదు. మధిర నియోజకవర్గానికి సరిహద్దునున్న ఎన్టీఆర్ జిల్లా మాగల్లు కేంద్రం నుండి ప్రతిరోజు రాత్రి వేళలో వందల సంఖ్యలో లారీలు మధిర మీదుగా ఖమ్మం కు వెళుతున్నాయి. ఇసుక తీసుకొని వెళుతున్న లారీలు అధిక వేగంతో వెళుతూ ప్రజలను వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రాత్రి వేళలో మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్లు ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నారు. అంతేకాకుండా రహదారులు సైతం ధ్వంసం అవుతున్నాయి.

లారీలకు పర్మిట్ లేవు. వే బిల్లులు లేవు

ఆంధ్ర నుండి మధిర మీదుగా ఖమ్మం తీసుకుని అక్రమంగా రవాణా చేస్తున్న లారీలకు ఎటువంటి పర్మిట్లు లేవని ఆర్టీవో అధికారులు చేసిన తనిఖీల్లో వెల్లడైంది. అంతేకాకుండా లారీల్లో తీసుకొని వస్తున్న ఇసుకకు సంబంధించిన వేబిల్లులు కూడా లేవు. కొన్ని లారీలకైతే వాహనాల నంబర్లు కూడా లేకపోవడం గమనర్హం. రవాణా శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకి పోతున్నాయి. వాహనానికి సరైన నంబర్ లేకపోవడం ధ్రువపత్రాలు లేకపోవడంతో పాటు డ్రైవర్లు మద్యం మత్తులో అతివేగంగా లారీలను నడిపి ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మైనింగ్ శాఖ అధికారులు ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్ నుండి మధిర మీదుగా ఖమ్మం జిల్లాకు ప్రతిరోజు వందల సంఖ్యలో అనుమతి లేకుండా ఇసుక రవాణా అవుతుంటే సంబంధిత శాఖ అధికారులు ఏం చేస్తున్నారని వివిధ రాజకీయ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి

తెలంగాణ రాష్ట్రంలో అక్రమ ఇసుక విక్రయాలను అరికట్టేందుకు ఇసుక కృత్రిమ అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మినరల్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులకు గృహ అవసరాలకు ఇసుక తీసుకొని పోవాల్సి ఉంది. ఈ నిబంధనలను అతిక్రమించి ఆంధ్ర నుండి ప్రతిరోజు అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆదానికి గండి కొడుతూ లారీల ద్వారా టన్నులకు టన్నులు ఇసుక తీసుకొని వస్తున్నా దీనిని అరికట్టాల్సిన మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఆశాఖ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఏడు లారీలను సీజ్ చేశాం!

వైరా ఎంవిఐ శంకర్ నాయక్

ఎటువంటి పత్రాలు లేకుండా ఆంధ్ర నుంచి వస్తున్న ఏడు ఇసుక లారీలను సీజ్ చేసి, కేసు నమోదు చేసి బోనకల్లు పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగిందని వైరా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నాయక్ తెలిపారు.


SAKSHITHA NEWS