విజయవాడ: అసైన్డ్ రైతులకు కౌలు చెల్లించకుండా ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని అమరావతి రాజధాని ఐకాస నేతలు ఆరోపించారు. డాక్యుమెంట్లు చూపాలని రైతులను వేధిస్తారా?
అని ప్రశ్నించారు. రాజధాని అసైన్డ్ రైతుల వార్షిక కౌలు నిలుపుదలను నిరసిస్తూ విజయవాడలోని గాంధీనగర్ ధర్నాచౌక్ వద్ద రైతులు, ఐకాస నేతలు మహాధర్నా చేపట్టారు. సాయంత్రం 4గంటల వరకు ఈ నిరసన కొనసాగించనున్నట్లు తెలిపారు.
”వేరే ప్రాంతం వారికి ఇక్కడ ఇళ్లు అంటున్నారు.. భూములిచ్చిన రైతుల పరిస్థితేంటి? పత్రాల సాకుతో వార్షిక కౌలు నిలుపుదల చేశారు. మేం కోర్టుకు వెళ్తే వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందని గ్రహించాలి. వార్షిక కౌలు కూడా చెల్లించని ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెబుతారు” అని రాజధాని రైతులు హెచ్చరించారు.
”పేదల సీఎం అని జగన్ చెబుతున్నారు.. కానీ వారికే న్యాయం చేయట్లేదు. సీఎంకు.. రాజధానిలోని ఎస్సీలు పేదవాళ్లుగా కనబడట్లేదా? నమ్మి భూములిస్తే.. అమరావతి రైతులను రోడ్డున పడేస్తారా? ఎస్సీలపై జగన్కు ఎందుకింత కక్ష?” అని ఐకాస నేతలు ప్రశ్నించారు.