SAKSHITHA NEWS

రాబోవు ఎన్నికల్లో ఏ ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను
రాబోయే ఎన్నికల్లో గెలిచేదంతా పొంగులేటి టీమే
పార్టీ నుంచి సస్పెండ్ చేసినందుకు కృతజ్ఞతలు
రావణాసురుడి చెర నుంచి విముక్తి లభించింది
పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా బతిలాడి చేర్పించుకున్నారు
ఎన్నోసార్లు మాయమాటలు చెప్పి మోసం చేశారు
ఎన్నో ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేశా
ప్రజా బలం ఉన్న నన్ను ఏం చేయలేరు
భవిష్యత్తులో నేనేంటో చూపిస్తా
అతి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తా
విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

కొత్తగూడెంలో 2014లో ఒక సీటు గెలిచారు.. 2018లో ఖమ్మంలో ఒక సీటును గెలిచారు.. 2023లో ఉమ్మడి జిల్లానుంచి ఒక్కరంటే ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం కొత్తగూడెంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం తర్వాత పొంగులేటిని, జూపల్లిని పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పొంగులేటి ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ….. ఎన్నో విషయాల్లో కేసీఆర్, కేటీఆర్ మాటలు నమ్మి మోసపోయానని.. పార్టీలో చేరిన చాలా కాలం తర్వాత వీరి గురించి తెలిసి జ్ఞానోదయం అయిందనన్నారు. ఎన్నో విషయాలల్లో తనను వాడుకొని నమ్మక ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. పొంగులేటి పార్టీలోనే లేనన్నారని.. పార్టీలో లేని వ్యక్తిని ఇప్పుడు ఎట్లా సస్పెండ్ చేస్తారని ధ్వజమెత్తారు.
భవిష్యత్తులో తనలాంటి అసంతృప్త నేతలను ఏకం చేసి తానేంటో చూపిస్తానన్నారు. మొత్తానికి రావణాసురుడి కబంధ హస్తాలనుంచి ఇన్నాళ్లకు విముక్తి కలిగి భద్రాద్రి శ్రీరాముడి పాదాలను తాకే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. తాను ఎప్పుడు ప్రజల క్షేత్రంలోనే ఉంటానని.. ఇకపై కూడా ప్రజల్లోనే తేల్చుకుంటాన్నారు.

  • కేసీఆర్ కుటుంబం బంగారు కుటుంబమైంది

వేటి కోసమైతే తెలంగాణ యువత ఆరాటపడ్డదో.. నీళ్లు, నిధులు, నియమకాల కోసం పోరాటం చేశారో… ఎవరికి ఏమేమి వచ్చాయో తెలియదు కానీ.. కల్వకుంట్ల కుటుంబానికి మాత్రం అద్భుతంగా అన్నీ వచ్చాయన్నారు. తెలంగాణ బంగారు తెలంగాణ కాకపోయినా.. వారి కుటుంబం మాత్రం బంగారు కుటుంబం అయిందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థులు, యువకులు ఆత్మ బలిదానాలు చేశారని, ఎంతో మంది మేధావులు, కవులు, కళాకారులు, యువత ఉద్యోగ సంఘాల నుంచి గ్రామీణ ప్రాంతాంలో ఉన్న చివరి వ్యవసాయ కార్మికుడి వరకు ఉద్యమంలో కదం తొక్కితేనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. సాధించుకున్న తెలంగాణలో అధికారం ఇచ్చి ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణ సమాజాన్ని గాలికి వదిలేశారని మండిపడ్డారు. తెలంగాణ వనరులను, ప్రజల కష్టార్జితాన్ని దోచుకోని లక్షలాది కోట్లకు అధిపతి అయి కేసీఆర్ అమరవీరుల ఆశయాలను అపహాస్యం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. జయశంకర్ లాంటి మహానుభావులు అందించిన సిద్ధాంతాలను తుంగలో తొక్కారన్నారు. బీఆర్ఎస్ ఏర్పాటుతోనే కేసీఆర్ పతనం ప్రారంభమైందన్నారు.

  • మాయమాటలతో మభ్య పెడుతున్నారు

గత ఎన్నికల్లో తనకు ఎంపీ టికెట్ ఇవ్వకుండా ఓ అభ్యర్థికి ఇచ్చి తననే గెలిపించాలని చెప్పినా పార్టీ కోసం గెలిపించానని, ఆ తర్వాత రాజ్యసభ సీటు కూడా ఇవ్వకుండా అవమాన పరిచారన్నారు. నాతో పాటు ఎంతోమంది నాయకులను తడి గుడ్డతో గొంతు కోయాలని చూశారని ధ్వజమెత్తారు. 2018లో ఎన్నికల తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం గెలుపుకోసం ఎంతో కృషిచేశానన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా తన మనుషులకు ఒక్క సీటు సైతం ఇవ్వలేదన్నారు. గత సింగరేణి ఎన్నికల్లో తాను ఎంతో కృషి చేసి గెలిపించిన విషయం వాస్తవం కాదా అన్ని సీఎంను ప్రశ్నించారు. ఎన్నికల్లో మీ పార్టీ కోసం పనికొచ్చిన శ్రీనివాసరెడ్డి ఇప్పుడు పనికి రాకుండా పోయాడా అని మండిపడ్డారు. మీరు చెప్పిన మాటలన్నీ మేడిపండు మాటలని ఆనాడు గ్రహించలేక పోయానని… ఎంతో మంది మేధావులు, యోధానుయోధులు వల్లే తెలంగాణ సిద్ధించిందని.. వారందరినీ మీరు అవమానించింది వాస్తవం కాదా అన్నారు.

  • బతిలాడి ఆహ్వానించలేదా..?

పాలేరు ఉప ఎన్నికల్లో నేను లేకపోతే అక్కడ గెలవడం కష్టమని.. వైసీపీలో రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్న తనను పార్టీలోకి బతిలాడి ఆహ్వానించారని, తనతో పాటే మరో ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా పార్టీలో చేర్పించుకున్నారని, వందలాది ప్రజాప్రతినిధులు సైతం తమతో కలిసొచ్చారన్నారు. పాలేరు ఉప ఎన్నికల సందర్భంగా కేటీఆర్ తన ఇంటికి వచ్చి టీఆర్ఎస్ లో చేరి బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆహ్వానించినట్లు తెలిపారు. వారి మాటలు నమ్మి తనతో పాటు ఉన్న ప్రజాప్రతినిధులు, శ్రేణులు కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరామన్నారు. అనంతరం పాలేరు ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని కనీవిని ఎరుగని రీతిలో గెలిపించుకున్నామన్నారు. ఆ తర్వాత వీరి నిజస్వరూపం ఏంటో బయటపడిందన్నారు.

  • కేటీఆర్ కోసమే ఇంతకాలం ఉన్నా

నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్న తనను, తనను నమ్మకున్న వేలాది మందిని ఎన్నోసార్లు ఇబ్బందులకు గురిచేశారని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, చివరికి నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసినా తాను నమ్మిన సిద్ధాంతాన్ని వదలనన్నారు. తన చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ప్రజల్లోనే ఉంటానన్నారు. శ్రీనివాసరెడ్డిని బంధించి చెరసాలలో పెట్టాలని చూస్తున్నారని.. తాను ప్రజల గుండెల్లో ఉన్నానని.. ఎవరూ ఏమీ చేయలేరన్నారు.. 2013కు ముందు వరకు తనకు రాజకీయ చరిత్ర లేదని తెలిపారు. అలాంటి నాకు ఈనాడు లక్షలాది మంది జనం అభిమానం తనకు ఉందన్నారు. తనను ఎన్నో ఇబ్బందులకు గురిచేసినా కేవలం కేటీఆర్ గురించే బీఆర్ఎస్ పార్టీలో ఇంతకాలం ఉన్నానన్నారు.

  • అసంతృప్తితో రగిలిపోతున్నారు

ప్రజాబలాన్ని ఎవరూ ఆపలేరని చెప్పడానికి హుజూరాబాద్ ఉప ఎన్నికే నిదర్శనమని… మీ పార్టీలో ఉన్న ముఖ్య నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత మంది చిత్తశుద్ధితో మీరు గెలవాలని చూస్తున్నారో పరిశీలించుకోవాలని శ్రీనివాసరెడ్డి చెప్పారు. మీ సొంత పార్టీ నాయకులే మీ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. కొద్దిరోజుల్లో అది స్పష్టంగా చూడబోతున్నారన్నారు. ఎన్నో రోజుల నుంచి సస్పెండ్ చేయని మీరు కొత్తగూడెం సభతో ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని.. కనీసం షోకాజ్ నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేశారని.. మీరు సస్పెండ్ చేసిన తీరు సరైందికాదన్నారు.

  • సమయం ఆసన్నమైంది

పాలేరులో బీఆర్ఎస్ పార్టీతో మొదలైన తన ప్రస్థానం కొత్తగూడెం శీనన్న అభిమానుల ఆత్మీయ సమ్మేళనంతో ముగిసిందని, సోమవారం ఉదయాన్నే బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేస్తూ ప్రకటన చేయడం జరిగిందన్నారు. పార్టీకి 2018 ఏప్రిల్ నెలలో రమ్మన్నది వారేనని.. సరిగ్గా ఏడేళ్ల తరువాత అదే ఏప్రిల్ నెలలో పార్టీ నుంచి పొమ్మంటున్నదీ వారే అన్నారు. పార్టీలో పొంగులేటికి సభ్యత్వమే లేదన్నారని, అసలు సస్పెన్షన్లే బీఆర్ఎస్ లో ఉండవని అన్న పార్టీ పెద్దలు తనను సస్పెండ్ చేస్తూ ప్రకటన చేయడం విడ్డూరమన్నారు. మూడున్నర నెలలుగా బీఆర్ఎస్ పై తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నా.. ఇప్పుడు సస్పెండ్ చేయడం హాస్యస్పాదమన్నారు. ఉమ్మడి జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాలనే మలుపుతిప్పే ప్రయత్నం చేస్తానని… సమయం ఆసన్నమైందని, అన్నిజిల్లాల్లో తనలాగా బాధపడే అందరినీ కలిసి వారితోనే నిర్ణయం తీసుకుంటానన్నారు. అతికొద్ది రోజుల్లోనే జెండా, ఎజెండా. ప్రకటించబోతున్నాను సిద్ధంగా ఉండండంటూ ఈ సందర్భంగా పొంగులేటి చెప్పారు.


SAKSHITHA NEWS