రాజమహేంద్రవరం: త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీ చేస్తాననే విషయం ఇంకా తెలియదని సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు అలీ (Actor Ali) అన్నారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీ చేస్తాననే విషయం నాక్కూడా తెలియదు. సీఎంవో నుంచి కాల్ రావాల్సిఉంది. ముఖ్యమంత్రి పిలిచి ‘ఫలానా చోటు నుంచి పోటీ చెయ్’ అని అంటే అందుకు సిద్ధంగా ఉన్నా. ఈ వారంలో కబురు రావచ్చు. ఏ పార్టీలో ఉన్నా, పోటీలో నిలబడిన వ్యక్తి మంచివారైతే ప్రజలు గెలిపిస్తారు. అక్కడినుంచి ఇక్కడికి.. ఇక్కడినుంచి అక్కడికి పార్టీలు మారిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఎవరు ఏమిటనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరితో ఎవరు పొత్తులు పెట్టుకున్నా, అంతిమనిర్ణయం ఓటరుదే. ఎన్నికలకు మేమూ సిద్ధం అంటున్నాం.. వాళ్లూ సిద్ధం అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో!’’ అని అలీ అన్నారు.
హాస్య నటుడిగా, కథానాయకుడిగా పలు చిత్రాల్లో నటించి మెప్పించిన అలీ కొన్నేళ్లకిందట వైకాపాలో చేరారు. గత ఎన్నికల్లోనే పోటీ చేయమని తనని అడిగారని, అయితే క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోకుండా రాజకీయాల్లో అడుగుపెడితే ఇబ్బందిపడతానన్న దృష్టితో పోటీ చేయలేదన్నారు. అంతేకాకుండా అప్పటికే ఒప్పుకొన్న సినిమాలకు అన్యాయం జరుగుతుందన్న అభిప్రాయంతో ఆ ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వ సలహాదారుల్లో ఒకరిగా అలీ నియమితులయ్యారు.