SAKSHITHA NEWS

ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు..సీఎం జగన్

అమరావతి: రైతు భరోసా కేంద్రాలను పౌరసరఫరాల శాఖతో అనుసంధానం చేసే అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఆర్బీకేల కార్యకలాపాలు సమర్థవంతంగా కొనసాగడానికి లైన్‌ డిపార్ట్‌మెంట్లతో సమర్థవంతమైన సమన్వయం ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు మార్గదర్శక ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. క్రమం తప్పకుండా భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు సాయిల్‌ కార్డులు ఇవ్వాలని ఆదేశించారు.

అదే విధంగా సాయిల్‌కార్డులతోపాటు ఆ భూమికి తగిన విధంగా ఎరువులు, పంటలసాగుపై సలహాలు అందించాలన్నారు. ఖరీఫ్‌ పంటల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. కనీస మద్దతు ధర కన్నా.. ఒక్క పైసా కూడా తగ్గకూడదని పేర్కొన్నారు. రైతులకు ఎంఎస్‌పీ ధర అందాల్సిందేనన్న ముఖ్యమంత్రి.. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదని స్పష్టం చేశారు.


SAKSHITHA NEWS