గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఫైల్ ను గవర్నర్ తమిళిసై వెనక్కి పంపేశారు. కాస్త ఆలస్యమైనా ఆమోదిస్తారని ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ పెద్దలకు గవర్నర్ నిర్ణయం షాక్ లా తగిలిగింది.*
దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లు గవర్నర్ కోటాలో ఆమోద యోగ్యం కాదని ఫైల్ ను వెనక్కి పంపేశారు దీంతో కొత్త వారిని కేసీఆర్ సిఫార్సు చేయాల్సి ఉంది.
నిజానికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పదవి కాలం ఎప్పుడో పూర్తయింది. కొంత కాలం ఎవర్నీ నియమించకుండా కేసీఆర్ ఆలస్యం చేస్తే..ఇప్పుడు గవర్నర్ కొంత కాలం ఆలస్యం చేసి వారి పేర్లను వెనక్కి పంపేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో మాత్రం గవర్నర్ ఆమోదం తప్పని సరి. దీంతో తమిళి సై అంత సామాన్యంగా ఓకే చేయడం లేదు. సాధారణంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫారసు చేయాలంటే.. వివిధ రంగాల్లో పేరు ప్రతిష్టలు పొందిన వారిని , మేధావులను సిఫారసు చేయాలనే సంప్రదాయం ఉంది. రాజకీయ నేతలకు అవకాశం కల్పించరు. గవర్నర్ కూడా అదే చెబుతున్నారు.
గతంలో పాడి కౌశిక్ రెడ్డి క్రీడలకు సేవ చేశారన్న కారణం చూపి నామినేట్ చేశారు. అయితే పాడి కౌశిక్ రెడ్డిపై కేసులున్నాయన్న కారణంగా గవర్నర్ తిరస్కరించారు. దాంతో ఆయనను కేసీఆర్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ చేసి… మాజీ స్పీకర్ మధుసూదనాచారికి గవర్నర్ కోటాలో చాన్సిచ్చారు. ఆయన పేరును గవర్నర్ వెంటనే ఆమోదించారు. కానీ ఇప్పుడు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను గవర్నర్ ఆమోదించలేదు. దాసోజు శ్రవణ్ రాజకీయ నేతగానే అందరికీ పరిచయం. అలాగే కుర్రా సత్యనారాయణ కూడా మాజీ ఎమ్మెల్యే. ఈ కారణాలతో వారి పేర్లను గవర్నర్ ఆమోదించ లేదని చెబుతున్నారు.