SAKSHITHA NEWS

11 ఎకరాలు.. 15 అంతస్తుల్లో నిర్మాణం

హైదరాబాద్‌,
భారత రాష్ట్ర సమితి పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. ‘భారత్‌ భవన్‌’ పేరిట కోకాపేటలో నిర్మించనున్న ఈ భవనానికి కేసీఆర్‌ భూమిపూజ చేయనున్నారు. భారత్‌ భవన్‌ను 15 అంతస్తులతో నిర్మించనున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. భారత్‌ భవన్‌ నిర్మాణంతో పాటు ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌’, ‘హ్యుమన్‌ రిసోర్స్‌ డెవల్‌పమెంట్‌’ పేరిట మరికొన్ని నిర్మాణాలను బీఆర్‌ఎస్‌ చేపట్టనుంది. భారత్‌ భవన్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత కేసీఆర్‌ అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు.ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడి జాతీయ కార్యాలయం నుంచి బీఆర్‌ఎస్‌ పనులు చూసుకుంటారు. మిగతా సమయాల్లో భారత్‌ భవన్‌ నుంచే పార్టీ పనులన్నీ చక్కబెట్టనున్నట్లు సమాచారం. కోకాపేటలో అత్యంత విలువైన భూమిని సర్కారు బీఆర్‌ఎస్ కు కేటాయించింది. బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ డెవల్‌పమెంట్‌’ కేంద్రం ఏర్పాటు చేసేందుకంటూ ఈ భూమిని కేటాయించింది. ఈ కేంద్రం ఏర్పాటుకు భూమి కావాలంటూ బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి గత నెల 12న ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా, కేవలం ఐదు రోజుల్లోనే భూమిని కట్టబెడుతూప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీఆర్‌ఎ్‌సకు ఇప్పటికే బంజారాహిల్స్‌లో భారీ విస్తీర్ణంలో ప్రధాన కార్యాలయం, 33జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాలకు స్థలాలు ఉన్నా.. మళ్లీ 11 ఎకరాల భూమిని కేటాయించుకోవడం గమనార్హం. కోకాపేటలో చదరపు గజం రూ.లక్ష నుంచి లక్షన్నర పలుకుతుండగా..ప్రభుత్వం కేవలం చదరపు గజం రూ.7500 చొప్పున 11 ఎకరాలను బీఆర్‌ఎ్‌సకు కట్టబెట్టింది. హెచ్‌ఎండీఏ లెక్కల ప్రకారం చూసుకుంటే ఇది రూ.500 కోట్ల స్థలం. కానీ, కేవలం రూ.40 కోట్లకే ప్రభుత్వం తమ పార్టీకి కేటాయించుకోవడంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే.

నైపుణ్య శిక్షణ, అవగాహన కోసం..!

ఇంత విలువైన స్థలంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు చేయనున్న కేంద్రం ద్వారా ప్రజా నాయకులకు వ్యక్తిత్వ వికాస నైపుణ్యం కల్పిస్తామని, సామాజికవేత్తలకు శిక్షణ ఇస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి చేసుకున్న దరఖాస్తులో పేర్కొన్నారు. స్టేట్‌ ఆర్ట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌, లైబ్రరీతోపాటు ఇక్కడ శిక్షణ పొందేవారికి, పనిచేసే సిబ్బందికి సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఇందుకోసం గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ పార్టీకి బోయిన్‌పల్లిలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించుకున్న విషయాన్ని ఉదాహరణగా సర్కారు చూపిస్తోంది


SAKSHITHA NEWS