SAKSHITHA NEWS

ప్రభుత్వ ఆసుపత్రి పారిశుద్ధ్య సెక్యూరిటీ కార్మికుల ఐదు నెలల పెండింగ్ వేతనాలకై కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ధర్నా.
ప్రభుత్వాలు మారుతున్న జీతాలు లేక పస్తులు తప్పడం లేదు.పి.సురేష్ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)రాష్ట్ర కార్యదర్శి.

*సాక్షిత వనపర్తి

ప్రభుత్వాలు ఎన్ని మారుతున్న ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం జీతాలు రాక పస్తులు తప్పడం లేదని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియూసి) రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి)ఆధ్వర్యంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని వనపర్తి జిల్లాలో ఉన్న ఆత్మకూర్, విపనగండ్ల, రేవల్లి, ఖిల్ల ఘనపూర్ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ కార్మికులకు ఐదు నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లాకలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేశారు.


ఈ సందర్భంగా పి.సురేష్ మాట్లాడుతూ:-రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న సామాజిక ఆరోగ్య కేంద్రాలలోని పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్వైజర్ కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉంచారని దీనితో ఆసుపత్రి కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. సంబంధిత వెంకటయ్య సెక్యూరిటీ సర్వీసెస్ ఏజెన్సీ కాంట్రాక్టర్ ని వేతనాలు చెల్లించాలని పలుమార్లు అడిగినా దాటవేస్తూ డొంక తిరుగుడు సమాధానాలు చెబుతూ వేతనాలు అడిగిన కార్మికులను తీవ్రమైన వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం నుండి వేతన బడ్జెట్ విడుదలలో జాప్యం జరిగిన ఏజెన్సీ వారే బాధ్యత వహించి ప్రతినెల వేతనాలు అందించాలని కాంట్రాక్టు అగ్రిమెంట్లో ఉన్నప్పటికీ నెలల తరబడి జీతాలు చెల్లించకుండా పెండింగ్లో ఉంచుతున్నారని ఈ సమస్యపై ఇప్పటికే అనేక పర్యాయాలు జిల్లా వైద్య శాఖ అధికారుల దృష్టికి కూడ తీసుకెళ్లడం జరిగిందని అన్నారు.

కార్మికులకు చెల్లించాల్సిన పీఎఫ్ ఈఎస్ఐ లో కూడా అప్డేట్స్ చూయించడం లేదని దీనితో కార్మికుల వాటా ప్రతినెల వేతనంల కటింగ్ అవుతున్న ఎంత జమ అవుతుందో తెలియని దుస్థితి నెలకొన్నదని అన్నారు.వెంకటయ్య సెక్యూరిటీ ఏజెన్సీస్ కాంట్రాక్టర్ తీసుకున్నప్పటి నుండి ఇదే తంతు కొనసాగుతుందని వేతనాలు లేక కార్మికులు నెలవారి ఇంటి అద్దెలు పిల్లల ఫీజులు ఈఎంఐలు పొదుపు సంఘాల అప్పులు చెల్లించలేక ప్రైవేట్ అప్పుల ఊబిలో కూరుకు పోయారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికులకు వేతన బడ్జెట్ విడుదల చేసి కార్మికులకు వేతనాలు అందించాలని, కార్మికులను వేధింపులకు గురి చేస్తున్న వెంకటయ్య ఏజెన్సీ నిర్వాహకులపై విచారణ జరిపి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ సామాజిక ఆరోగ్య కేంద్రాల కార్మికులు సత్తార్, బాలరాజ్, అనిల్, అరుణ్, ఇందిరా, రేణుక, మన్నెమ్మ,ఆశ బి, వెంకటమ్మ, నారాయణమ్మ, పార్వతమ్మ, జహీర బేగం,చెన్నమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS