సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్
విశ్వసించిన ప్రజలారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది – ఏ విధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించే వారికి కూడా విధించబడిందో. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది. (అల్ బఖర: 183) ఇస్లాం అయిదు మూల స్తంభాలలో ‘ఉపవాసం’ ఒకటి. మనిషిలో భయభక్తులు జనించాలన్నదే ఉపవాస ముఖ్య ఉద్దేశం. మనిషి రమజాన్ మాసంలో అన్నపానీయాలు, మనో వాంఛలకు దూరంగా ఉండటానికి ముఖ్య కారణం
దివ్య ఖురాన్ – రమజాన్:
హజ్రత్ అబూ హురైరా (ర) ఉల్లేఖనం ప్రకారం, మహాప్రవక్త (స) ఇలా తెలిపారు: “ఏ వ్యక్తి ధర్మనిష్ఠతో, ఆత్మపరిశీలనతో పరలోక ప్రతిఫలాపేక్షతో రమజాన్ రోజాలు పాటిస్తాడో, అతను పూర్వం చేసిన పాపాలను అల్లాహ్ మన్నించి వేస్తాడు. ఎవరయితే ధర్మనిష్ఠతో ఆత్మ పరిశీలనతో పరలోక ప్రతిఫలాపేక్షతో తరావీహ్ నమాజ్ చేస్తాడో అతడు పూర్వం చేసిన అపరాధాలను అల్లాహ్ క్షమిస్తాడు.” (ముత్తఫకున్ అలైహి) మరో సందర్భంలో మహాప్రవక్త (స) ఇలా ప్రవచించారు. “రోజా, కుర్ఆన్ ఈ రెండూ విశ్వాసి (మోమిన్) కొరకు సిఫారసు చేస్తాయి. రోజా అంటుంది, ‘ప్రభూ! నేను ఈ వ్యక్తిని పగల్లో భోజనానికి, ఇతర వాంఛలకు దూరం చేశాను. ఇతడు దానికి శిరసావహిం’చాడు. (అందువల్ల ప్రభూ! అతని మోక్షానికైనా సిఫారసును స్వీకరించు.’ అలాగే దివ్య ఖుర్ఆన్ అంటుంది: నేను ఇతన్ని రాత్రిళ్ళల్లో సుఖనిద్రకు దూరం చేశాను. కనుక స్వామి! ఇతని ఎడల నా సిఫారసును స్వీకరించు.’ అప్పుడు అల్లాహ్ ఈ రెంటి సిఫారసును స్వీకరిస్తాడు.” (బైహకీ, మిష్కాత్ – అబ్దుల్లా బిన్ ఉమర్ కాబట్టి, రమజాన్ మాసంలో ఖుర్ఆన్ పారాయణంతో పాటు దానిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే దాని సందేశాన్ని ఇతరులకూ చేరవేసే ప్రయత్నం చెయ్యాలి.
ఉపవాసం వాస్తవికత :-
మహా ప్రవక్త ముహమ్మద్ (స) రమజాన్ మాస ఉపవాసాలు, వాటి వాస్తవికత గురించి అనేక విషయాలను తెలియజేశారు. హజ్రత్ అబూ హురైరా (ర) ఉల్లేఖనం ప్రకారం, మహాప్రవక్త(స) ఇలా ఉపదేశించారు : “ఎవరైతే (రోజా పాటిస్తున్నప్పటికీ) అసత్యం పలకడం, అసత్యాన్ని ఆచరించడం (ఉదా: వెక్కిరించ డం, నింద మోపడం, దూషణ, తిట్టడం, తప్పుగా మాట్లాడడం, వెన్నుపోటు, అపవాదు, దుష్ప్రచారం చేయడం మొదలైనవి) మానడో అటువంటివాడు ఆకలిదప్పులతో పడుండటం పట్ల అల్లాహ్ కు ఏ మాత్రం ఆసక్తి లేదు.” (బుఖారీ)
హజ్రత్ అబూ హురైరా(ర) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా బోధించారు : “ఎందరో రోజా పాటించే వ్యక్తులకు తమ ఉపవాసవ్రతం ద్వారా కేవలం ఆకలిదప్పులు తప్ప మరేమీ లభించదు. ఎందుకంటే వారు ఉపవాసం పాటిస్తూకూడా చెడు మాట్లాడడం చెడు చూడటం చెడు ఆచరించడం ఆపరు. అలాగే ఎందరో తరావీహ్ నమాజ్ చేసే వ్యక్తులకు తమ తరావీహ్ ద్వారా కేవలం జాగరణ తప్ప మరేదీ ప్రాప్తం కాదు.” (మిష్కాతో) ప్రతిఫల వాగ్దానం చేయబడిన ఉపవాసం హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (ర) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త(స) ఇలా అన్నారు: “ఏ వ్యక్తి ధర్మనిష్ఠతో, ఆత్మపరిశీలనతో పరలోక ప్రతిఫలాపేక్షతో రమజాన్ రోజాలు పాటిస్తాడో, అతను పూర్వం చేసిన పాపాలను అల్లాహ్ మన్నించి వేస్తాడు”. (ముత్తపకున్ అలైహి)
ఉపవాస వ్రతంలో అన్నపానీయాలకు దూరంగా ఉండటంతో పాటు చెడు కార్యాలకూ దూరంగా ఉండాలి. అలాగే నోటి ఉపవాసంతో పాటు ఇతర అవయవాల ఉపవాసాన్ని కూడా పాటించాలి. ఏ ఉపవాసమైతే కళ్ళు, చెవులు, నాలుక, కాళ్ళు, చేతులు, ఇతర అవయవాలకు సంబంధించిన పాపాలకు దూరంగా ఉంచుతుందో అదే అసలైన ఉపవాసం. అలాంటి ఉపవాసాన్ని పాటించిన వారే అల్లాహ్ బహుమానానికి అర్హుల వుతారు. కంటి ఉపవాసం. దివ్య ఖుర్ఆన్ అల్లాహ్ ఇలా తెలిపాడు: ప్రవక్తా! విశ్వసించిన పురుషులకు తమ చూపులను కాపాడుకోండి అనీ తమ మర్మాంగాలను రక్షించుకోండి అనీ చెప్పు. ఇది వారికి ఎంతో పరిశుద్ధమైన పద్ధతి. వారు చేసే దానిని గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. (అన్ సూర్: 30) ప్రవక్త (స) ఇలా తెలిపారు: ‘కంటి చూపు షైతాన్ బాణాలలో ఒక విషపూరితమైన బాణము. ఎవరైతే అల్లాహ్ కు భయపడి చెడు చూపునకు దూరంగా ఉంటారో, వారికి అల్లాహ్ ఉన్నతమైన విశ్వాసాన్ని ప్రసాదిస్తాడు.’ (అల్ హాకీమ్). కొంతమంది ముస్లింలు రమజాన్ మాసంలో ఉపవాసాలు పాటిస్తూ కూడా టెలివిజన్, కంప్యూటర్లలో అసభ్య సినిమాలు, కార్యక్రమాలు చూడటం,అలాగే పనికిమాలిన పుస్తకాలు, నవలలు చదవడం చాలా బాధాకరం. ఉపవాసముతో ఉన్నాము, పొద్దుపోవడానికి అలా ‘చదువుచున్నాము అని అనడం ఇంకా బాధాకరం.
చెవుల ఉపవాసం:
చెడు అనకు అనేది నోరు పాటించే ఉపవాసమైతే, చెడు వినకు అనేది చెవులు పాటించే ఉపవాసం. అల్లాహ్ దివ్య ఖుర్ఆన్లో ఇలా తెలిపాడు:
అక్కడ వారు వ్యర్థమైన మాట ఏదీ వినరు. అక్కడ దేనిని విన్నా సరియైన దానినే వింటారు. (మర్యమ్: 62)
అల్లాహ్ ఇంకా ఇలా తెలిపాడు: అదేవిధంగా అక్కడ వారు పనికిమాలిన విషయాలు గానీ, పాప విషయాలు గానీ వినరు. (అల్ వాఖిఅహ్: 25)
బూతు పదాలు, బూతు సాహిత్యం, అశ్లీల పాటల నుండి చెవులను కాపాడుకోవాలి. ఎందుకంటే, ఇవి నోటితో అనడం నిషిద్ధమైనట్లే వాటిని వినడం కూడా నిషిద్ధమే. పై వాక్యాలలో కూడా ఇదే విషయం తెలుపబడింది. నాలుక ఉపవాసం: నాలుక ఉపవాసం ఏమిటంటే, దానిని పనికిమాలిన మాటలు, అబద్ధం, చాడీలు, నింద మోపడం, దూషణ, తిట్టడం, తప్పుగా మాట్లాడడం, దుష్ప్రచారం చేయడం వంటి వాటికి దూరంగా ఉంచాలి. అవసరం మేరకు మాత్రమే మాట్లాడాలి. మిగిలిన సమయంలో ఖురాన్ పారాయణం చేస్తూ ఉండాలి. తద్వారా మంచినే మాట్లాడగలం.. మహాప్రవక్త(స) ఉపదేశించారు. “రోజా డాలు వంటిది. మీలో ఎవరయినా, రోజా పాటిస్తున్నట్లయితే, ఆ దినాన నోటితో అశ్లీలమయిన పలుకులు పలకరాదు. అల్లరి పనులు చెయ్య రాదు, ఇతరులెవరయినా తిట్టినా, జగడానికి దిగినా, నేను రోజా పాటిస్తున్నాను’ అని గుర్తుంచుకోవాలి.” (బుఖారీ, ముస్లిమ్) ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ ఆజ్ఞ మేరకు సహరీ ఇఫ్తార్లలో హలాల్ (ధర్మ సమ్మతమైన) దానినే తినడానికిప్రయత్నం చేస్తాం. కానీ, పరోక్ష నిందలో మునిగిపోతాం.
ఉదర ఉపవాసం:
నిషిద్ధమైన వాటికి దూరంగా ఉండటం ఎల్లవేళలా అవసరమే. అయితే, ఇఫ్తార్ సమయంలో ఆహార పదార్థాలు ఎక్కువగా భుజించే ప్రయత్నం చేయకూడదు. అప్పుడే మనసులో ఉత్పన్న మయ్యే కోరికలకు కళ్లెం వేయడానికి మరియు షైతాన్ పన్నాగాలను భగ్నం చేయడానికి వీలవుతుంది. ఇఫ్తార్ సమయంలో లేదా ఇఫ్తార్ తరువాత హరామ్ ఆహార పదార్థాలను తినడంలో కూడా జాగ్రత్త వహించాలి. లేనిచో ఉదయం నుండి సాయంత్రం వరకు అన్న పానీయాలకు దూరంగా ఉండటంలో అర్థమే ఉండదు. ఇతర అవయవాల ఉపవాసం: కాళ్లు, చేతులు, మిగిలిన అవయవాలను నిషిద్ధమైన పనులకు దూరంగా ఉంచడమే ఉపవాస ముఖ్య ఉద్దేశం. అల్లాహ్ దివ్య ఖురాన్లో ఇలా తెలిపాడు: మీకు తెలియని విషయం వెంట పడకండి. నిశ్చయంగా కళ్ళూ, చెవులూ, మనస్సూ అన్నింటి విషయంలోనూ విచారణ జరుగు తుంది. (బనీ ఇస్రాయీల్: 36)చేతులతో చెడు పనులు చేయడం, కాళ్లతో చెడు వైపునకు నడవడం నిషేధించబడ్డాయి. దివ్య ఖురాన్ లో ఇలా తెలుప బడింది: ఈనాడు మేము వారి నోళ్లు మూయిస్తాము. వారు ప్రపంచంలో ఏమేమి సంపాదిస్తూ ఉండే వారో వారి చేతులు మాకు చెబుతాయి, వారి కాళ్లు సాక్ష్యమిస్తాయి. (యాసీన్: 65) హృదయ ఉపవాసం: ప్రాపంచిక వ్యామోహాలకు దూరంగా, సత్రియలకు చేరువగా చేసేదే హృదయ ఉపవాసం. ఎవరి ప్రాపంచిక జీవితం ధర్మం కోసం అంకితమవుతుందో, అదే పరలోక సామగ్రి. ఉపవాస వ్రతంలో అన్నపానీయాలను, లైంగిక కాంక్షల్ని నిర్ణీత కాల వ్యవధిలో విసర్జించడమే కాదు, నోటి ద్వారా, కంటి ద్వారా, చెవుల ద్వారా చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా కూడా ఉపవాస వ్రతాన్ని పాటించాలి. అంటే చెడు మాటలు పలకడం, చెడు చూపులు చూడటం, చెడు విషయాలు వినటం, చెడు పనులు చేయటం, చెడు ప్రదేశాలకు వెళ్ళడం మానుకోవాలి. అప్పుడే హృదయ ఉపవాసం పదిలమవుతుంది. ఉపవాస లక్ష్యం. నెరవేరుతుంది.