మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా షీ-టీంల ఏర్పాటు
అత్యాధునిక వాహనాలు, మౌళిక సదుపాయాలు, సాంకేతికతతో పోలీస్ వ్యవస్థ బలోపేతం
రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో భాగంగా అవగాహన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం విజయవంతంగా అమలు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో భాగంగా శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు ప్రజలకు అందిస్తున్న సేవలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు, యువతకు అవగాహన కార్యక్రమం నగరంలోని ఐఎంఏ హాల్ లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ..
పోలీసు శాఖ పరిధిలో గతంలో ఉన్న పరిస్థితులకి, నేడు ఉన్న పరిస్థితులకి పొంతన లేదని , ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు అద్భుత విజయం సాధించామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి శాంతిభద్రతల పరిరక్షణ మొదటి ప్రాధాన్యతగా గుర్తించిన ప్రభుత్వం పోలీసులకు వాహనాలు, మౌళిక సదుపాయాలు, ఆధునిక సాంకేతికతను అందిస్తూ బలోపేతం చేసిందని అన్నారు. మహిళలకు రక్షణ కోసం ప్రత్యేకంగా షీ-టీం లను ఏర్పాటు చేశామని అన్నారు
. పోలీసింగ్ లో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రజలతో సత్సంబంధాలు కలిగి నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాలు జరిగితే త్వరితగతిన నేరస్తులను అరెస్ట్ చేస్తున్నామని అన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అమలు చేస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ అద్భుతమైన సేవలు అందిస్తున్నారని, నిరంతరం వచ్చే సవాళ్లను ఎదుర్కొంటూ 24 గంటలు అప్రమత్తతో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నామని తెలిపారు.
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఏ మూలన చిన్న సంఘటన జరిగిన సీసీ కెమెరాల ద్వారా కనిపెట్టిన పరిస్థితులు వున్నాయని అన్నారు. ఒక చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలను తీసుకుంటూ పోలీసుల ఆత్మగౌరవం పెరిగే విధంగా ప్రభుత్వం సహకారం అందించిందని అన్నారు. పటిష్ట శాంతిభద్రతల కారణంగా రాష్ట్రానికి కొత్త పెట్టుబడులతో పాటు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ ఏసీపీ అవినాష్ కుమార్ ,ఏసీపీ ప్రసన్న కుమార్, సిఐ శ్రీదర్ పాల్గొన్నారు.