తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి ఒక్క వీధి లైట్ వెలగాల్సిందేనని, అవసరమైన చోట్ల మరిన్ని వీధి లైట్లు ఏర్పాటు చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేసారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమంలో కమిషనర్ హరిత ఐఏఎస్ అర్జీలను స్వీకరించి సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
పూలవానిగుంట మైత్రీ అపార్ట్మెంట్ వద్ద వీధి లైట్లు వెలగడం లేదని, చీకట్లో పాములు,పురుగులు ఇండ్ల వద్దకు వస్తున్నాయనే పిర్యాధుపై కమిషనర్ హరిత ఐఏఎస్ స్పందిస్తూ నగరంలోని ప్రతి ఒక్క వీధి లైట్ వెలగాల్సిందేనని, లైట్లు వెలగడం లేదని పిర్యాధులు రాకుండా నిత్యం లైట్లు వెలుగుతున్నాయా లేదా అని పర్యవేక్షణ వుండాలని, పాడైన లైట్లను వెంటనే మరమ్మత్తులు చేయించాలని, అవసరమైన చోట్ల వీధి లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. అదేవిధంగా జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సచివాలయ అడ్మీన్లకు సూచనలు జారీ చేస్తూ తుఫాను హెచ్చరికలపై జాగ్రత్తగా వుండేలని, సమస్య ఎక్కడన్నా కనిపిస్తే వెనువెంటనే తమకి తెలియజేయాలన్నారు.
వచ్చిన పిర్యాధుల్లో ముఖ్యంగా రాఘవేంధ్రనగర్లో సైడు కాలువల కొరకు త్రవ్వినారని, సగమే కట్టడంతో మురుగునీరు ఇండ్ల ముందు నిలుస్తున్నదని, గాయత్రీనగర్లో వున్న తమకు రేషన్ కార్డ్ మంజూరు చేయించాలని, డి.ఆర్.మహాల్ ఏరియాలోని గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్ క్రింద కామన్ ఏరీయాను ఆక్రమించారని, చింతలచేనులోని రోడ్డుకు అప్రోచ్ రోడ్డు వేయించాలనే పిర్యాధులు, అర్జీలపై కమిషనర్ హరిత ఐఏఎస్ స్పందిస్తూ సంబంధిత అధికారులు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, రెవెన్యూ అధికార్లు కె.ఎల్.వర్మ, సేతుమాధవ్, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసులు రెడ్డి, వెటర్నరీ ఆఫిసర్ డాక్టర్ నాగేంధ్ర రెడ్డి, మేనేజర్ చిట్టిబాబు, సూపర్డెంట్లు, డిఈలు, ఆర్.ఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.