లబ్దిదారుడిపై ఒక్క రూపాయి భారం పడకుండా ఉచితంగా డబుల్ బెడ్ రూమ్

Spread the love

లబ్దిదారుడిపై ఒక్క రూపాయి భారం పడకుండా ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇచ్చిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లిలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను స్థానిక MLA బేతి సుభాష్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. అనంతరం కాలనీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చర్లపల్లి, అహ్మద్ గూడ, శ్రీరాం నగర్ లలో నిర్మించిన వెయ్యి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉప్పల్, మల్కాజ్ గిరి నియోజకవర్గాలకు చెందిన లబ్దిదారులకు ఇండ్ల కేటాయింపు పత్రాలను అందజేశారు. అంతకుముందు ఇండ్ల కేటాయింపు కోసం ర్యాండో మైజేషన్ పద్దతిలో ఆన్ లైన్ డ్రా నిర్వహించారు. ఎన్నో సంవత్సరాల సొంత ఇంటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పేద ప్రజలు ఎంతో సంతోషంగా, గొప్పగా జీవించాలనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. ఈ ఇండ్లను అర్హులైన వారిని గుర్తించి దశల వారిగా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందజేసిన దాఖలాలు ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేవని అన్నారు. గత ప్రభుత్వాలు వివిధ పథకాల పేరుతో నామమాత్రపు ఆర్ధిక సహాయం అందించి అగ్గిపెట్టెల్లాంటి ఇరుకైన ఇండ్లను నిర్మించి ఇచ్చేవారని, తమ ప్రభుత్వం లబ్దిదారుడిపై ఒక్క రూపాయి భారం పడకుండా ఎంతో విలువైన స్థలాలో ఇండ్లను నిర్మించి ఇస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.

నిరంతరం పేద ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తి మన ముఖ్యమంత్రి గా ఉండటం మనందరి అదృష్టం అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో పై అంతస్తులోకి వెళ్ళేవారు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా లిఫ్ట్ లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. కాలనీ పరిసరాలలో పారిశుధ్య నిర్వహణ, లిఫ్ట్ ల నిర్వహణ కోసం ప్రజలపై ఎలాంటి భారం పడకూడదనే ఆలోచనతోనే షాప్ లను నిర్మించడం జరిగిందని, ఈ షాప్ ల ద్వారా వచ్చే అద్దెను నిర్వహణ కోసం వినియోగించుకోవాలని వివరించారు. పేద ప్రజల కోసమే తమ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు పై కొన్ని పార్టీల నాయకులు డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు.

ఎంతో పారదర్శకంగా రాజకీయ జోక్యం లేకుండా పార్టీలకు అతీతంగా లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కానీ కొందరు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలను పట్టించుకోవద్దని, అందరికి ఇండ్లు ఇస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పేద, మద్య తరగతి ప్రజల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు. కంటి వెలుగు అనే వినూత్న కార్యక్రమం చేపట్టి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ళద్దాలు, మందులు ఉచితంగా అందించిన విషయాన్ని గుర్తుచేశారు. చివరికి స్మశాన వాటికల అభివృద్ధి, సౌకర్యాల కల్పన గురించి కూడా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారంటే ఎంత పెద్ద మనసో అర్ధం చేసుకోవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా వృద్దులు, వికలాంగులు, వితంతువులకు ఇచ్చే పెన్షన్ ను 2016 రూపాయలకు పెంచి ఇస్తూ వారి గౌరవాన్ని మరింత పెంచిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, లక్ష్మారెడ్డి, RDO రాజీవ్ కుమార్, జోనల్ కమిషనర్ పంకజ, DC ముకుందరెడ్డి, హౌసింగ్ EE వెంకటదాసు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page