అండగా నిలిచేందుకే వచ్చా….
- ప్రాథమిక నష్ట అంచనా వ్యయం రూ.5,438 కోట్లు
- భారీ వర్షాలతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు..
- మంత్రులు, అధికారులు బాగా పని చేశారు..
- ప్రతిపక్ష నేత మౌన ముద్ర ఎందుకు…?
- దోచుకున్న సొమ్ములో రూ.వెయ్యో.. రూ.2 వేల కోట్లో బాధితులకు సహాయం చేయండి
- మాకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదు…
- వ్యాపార, స్వచ్ఛంద సంస్థలు బాధితులను ఆదుకోవాలి..
- ఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- ఖమ్మంలో పలు కాలనీల్లో పర్యటించి బాధితులకు ఓదార్పు
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
అకాల వర్షాలు, వరదలతో నష్టపోయిన వారికి అండగా నిలిచేందుకే వచ్చానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు ముఖ్యమంత్రి సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి తొలుత సూర్యాపేట జిల్లాకు చేరుకున్నారు. వరద నష్టాలపై మోతెలో సమీక్షించారు. అనంతరం ఖమ్మం జిల్లాకు చేరుకున్నారు. నాయకన్ గూడెం వద్ద పాలేరు కాలువ పొంగి రహదారి తెగిపోవడంతో దానిని పరిశీలించారు. అనంతరం పాలేరు ఎడమ కాలువ గండి పడడంతో దానిని పరిశీలించారు. అక్కడి నుంచి ఖమ్మం చేరుకున్నారు. మున్నేరు వరదతో మునిగి తీవ్రంగా నష్టపోయిన పోలేపల్లి, పెద్ద తండా, బొక్కలగడ్డ కాలనీలను పరిశీలించారు. దెబ్బతిన్న ఇళ్లలోకి వెళ్లి పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారిని ఓదార్చారు. అనంతరం ఖమ్మం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు…
భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, 16 మంది ప్రాణాలు కోల్పోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, రహదారులు, కాలువలు, చెరువులకు గండ్లు పడడంతో పాటు విద్యుత్ సబ్‌స్టేషన్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని… ప్రాథమికంగా రూ.5,438 కోట్ల ఆస్తి నష్టం వాటిలినట్లు అంచనా వేశామని తెలిపారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఇంకా వర్షాలు కురుస్తున్నాయని, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయని సమాచారం అందిందిన్నారు. ప్రస్తుతం అధికార యంత్రాంగమంతా సహాయక చర్యల్లో నిమగ్నమైందని.. కొద్దిగా తెరిపి ఇవ్వగానే పూర్తి స్థాయి నష్టం అంచనాలు వేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
- కంటిపై కునుకు లేకుండా…
రెండు రోజుల క్రితం వర్షాలు ప్రారంభమైన దగ్గరి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, డిజాస్టర్ రెస్పాన్స్ కమిషనర్, కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానని, కంటిపై కునుకు లేకుండా పర్యవేక్షణ చేస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం అండగా ఉందనే విశ్వాసం బాధితులకు కల్పించేందుకు స్వయంగా వచ్చానని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలు బాధతో ఉన్నారని ఈ సమయంలో పర్యటనకు వద్దని కొందరు సూచించారని, ప్రజలు బాధలో ఉన్నప్పుడే అండగా ఉండాలని, సంతోషంలో ఉన్నప్పుడు అవసరం లేదని చెప్పి తాను వచ్చానని చెప్పారు.. మున్నేరు వరద బాధితుల ఇళ్లను, వారిని చూసినప్పుడు కలిగిన నష్టాన్ని మాటల్లో చెప్పలేమని, తమకు ఊహ వచ్చిన తర్వాత ఇంత వర్షాన్ని, వరదను చూడలేదని 70-80 ఏళ్ల వృద్ధులు చెప్పారని సీఎం తెలిపారు. వాళ్లకు ప్రభుత్వం ఎంత చేసినా తక్కువేనని, ఇంట్లో టీవీ, ఫ్రిజ్‌తో సహా బియ్యం, పప్పులు, ఉప్పులు మొత్తం కోల్పోయారని, వారికి తక్షణ ఉపశమనం కింద రూ.పది వేల చొప్పున అందజేయాలని అధికారులను ఆదేశించామన్నారు.
- విదేశాల్లో ఎంజాయ్ చేయండి… విమర్శలు మానండి…
తమకు ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వర్షాలు ప్రారంభమైన దగ్గరి నుంచి మంత్రులు, అధికారులు తాను ఊహించన దానికన్నా అద్భుతంగా పని చేస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అర్ధ రాత్రి దాటినా క్షేత్ర స్థాయిలో ఉన్నారని కితాబునిచ్చారు. మంత్రి ఉత్తమ్ ఢిల్లీ నుంచి హుటాహుటిన వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు. పొరుగు రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు, తమ పార్టీకి చెందిన షర్మిల వర్ష ప్రభావిత ప్రాంతాల్లో
ప్రజల్లోకి వెళుతున్నారని, ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫాం హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటూ మౌన ముద్రలో ఉన్నారని, కేటీఆర్ స్నేహితులతో కలిసి అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ అమెరికాలో స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ క్షేత్రంలో ఉన్న తమ మంత్రులపై విమర్శలు చేయడం మానుకోవాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని, ప్రధానమంత్రి మోదీ రాష్ట్రంలో పర్యటించాలని తాను కోరానని, ప్రధాన ప్రతిపక్షం ఎందుకు కేంద్రాన్ని ఆ విషయం కోరదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
- కల్వకుంట్ల కుటుంబం చిల్లిగవ్వ ఇవ్వదు…
రాష్ట్రంలో వరద కష్టాలకు చలించి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొంత సహాయం ప్రకటించారని, రూ.లక్షల కోట్లు సంపాదించిన కల్వకుంట్ల కుటుంబం మాత్రం చిల్లి గవ్వ సహాయం చేయరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. రూ.వెయ్యి కోట్లో.. రూ.2 వేల కోట్లో వరద సహాయ కింద ప్రకటించి తమ పాపాలకు ప్రాయాశ్చితం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు…
- తీరు మార్చుకోకపోతే కష్టం…
వరదలతో అంటురోగాలు ప్రబలే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు శుభ్రత చర్యలు చేపట్టాలని, వైద్యారోగ్య శాఖాధికారులు మందులు అందుబాటులో ఉంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, ఎకరా పంట నష్టానికి రూ.పది వేలు, పాడి పశువులకు రూ.50 వేలు, మేకలు, గొర్రెలు చనిపోతే రూ.5 వేల చొప్పున పరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి శాఖలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సమన్వయంతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి సూచించారు.
పని చేయని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రజలను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతని, తాము ఆ విధులు నిర్వహిస్తున్నామని, అయినప్పటికీ వ్యాపార, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కూడా ముందుకు వచ్చి బాధితులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. మీడియా కూడా నిజమైన సమస్యలను వెలికితీసి చూపాలని ముఖ్యమంత్రి కోరారు. కొన్ని పార్టీలకు చెందిన పత్రికలు, టీవీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటిని మీడియా అని తాము అనుకోవడం లేదన్నారు. వారు తీరుమార్చుకోవాలని లేకుంటే, శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో తీర్పులే వారి పార్టీలకు భవిష్యత్‌లో పునరావృతమవుతాయని ముఖ్యమంత్రి హెచ్చరించారు. సమీక్షలోఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ రఘురాంరెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు..