బీసీ కాంట్రాక్టర్లకు 42% రిజర్వేషన్ డిమాండ్‌పై ధర్నా
ప్రభుత్వంపై తీన్మార్ మల్లన్న తీవ్ర విమర్శలు
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి:
హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద బీసీ కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ మద్దతు తెలిపారు. మల్లన్న మాట్లాడుతూ బీసీలకు 42% కాంట్రాక్టుల కేటాయింపు న్యాయమైన డిమాండ్ అని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రధాన కాంట్రాక్టులు కొద్ది వర్గాలకు మాత్రమే కేంద్రీకృతమవుతున్నాయని విమర్శించారు. అదేవిధంగా స్థానిక బీసీ కాంట్రాక్టర్లను పక్కనపెట్టి ఇతర ప్రాంతాల వారికి పనులు అప్పగించడం అన్యాయమని పేర్కొన్నారు. బీసీ కాంట్రాక్టర్లకు పనులు ఇవ్వకపోవడం, చేసిన పనులకు బిల్లులు ఆలస్యం చేయడం వంటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ, బీసీ కాంట్రాక్టర్ల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు, పార్టీ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY