సూర్యాపేటలో ‘సురక్షిత మాతృత్వ పద్ధతులు’పై అవగాహన కార్యక్రమం
హెల్త్ వీక్‌లో భాగంగా నిర్వహణ – కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హాజరు
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి:
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్ వీక్ కార్యక్రమాల్లో మూడో రోజు సందర్భంగా “సురక్షిత మాతృత్వ పద్ధతులు”పై అవగాహన కార్యక్రమం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (ఎంసిహెచ్ బ్లాక్)లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మాతృత్వ భద్రతపై కలెక్టర్ సూచనలు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, ఆసుపత్రుల్లో ప్రసవాలు చేయించుకోవడం ఎంతో కీలకమని పేర్కొన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తూ తల్లి, శిశు ఆరోగ్యం రక్షణలో ముందస్తు జాగ్రత్తలు అవసరమని తెలిపారు. అదే విధంగా పీసీపీఎన్‌డీటీ చట్టం గురించి అవగాహన కల్పిస్తూ గర్భంలో శిశువు లింగ నిర్ధారణ నిషేధమని, దీనికి సంబంధించిన కఠిన శిక్షలను వివరించారు. శిశు సంరక్షణపై కూడా ముఖ్య సూచనలు చేశారు.
సందేశాత్మక నాటికలు – ఆకట్టుకున్న ఆరోగ్య సిబ్బంది
ఈ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య సిబ్బంది “సురక్షిత మాతృత్వ పద్ధతులు”పై సందేశాత్మక నాటిక ప్రదర్శించి అవగాహన కల్పించారు. నర్సింగ్ విద్యార్థులు సమాచారాత్మక పోస్టర్లు ప్రదర్శించి, యాంటెనాటల్ కేర్‌పై ప్రత్యేక నాటికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను కలెక్టర్ ప్రశంసిస్తూ సర్టిఫికెట్లు అందజేశారు.
సౌకర్యాల మెరుగుదలకు ఆదేశాలు
హాస్పిటల్‌కు వచ్చే గర్భిణీ స్త్రీలకు సరిపడ కుర్చీలు, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలు, ప్రసవానంతర మహిళలు, వైద్యులు, ఆశా వర్కర్లు, నర్సింగ్ అధికారులు మరియు గవర్నమెంట్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా తల్లి మరియు శిశు మరణాలను తగ్గించడం, ముందస్తు గుర్తింపు, సమయానుకూల రిఫరల్ సేవల మెరుగుదలపై ప్రధానంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ వెంకటరమణ, మెడికల్ సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్, డీసీహెచ్‌ఎస్, గవర్నమెంట్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్, పీవో ఎంహెచ్‌ఎన్, సీడీపీఓ తదితరులు పాల్గొన్నారు. సురక్షిత మాతృత్వం ద్వారా ఆరోగ్యవంతమైన తల్లి, ఆరోగ్యవంతమైన శిశువు, సంతోషకరమైన కుటుంబం నిర్మాణమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా అధికారులు స్పష్టం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY