SAKSHITHA NEWS

దేశం విడిచి పారిపోయేందుకు దేవినేని అవినాశ్‌ యత్నం!

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి వ్యవహారంలో.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి

టీడీపీ ఆఫీసుపై దాడి వెనుక కుట్ర కోణాన్ని తేల్చాలి

నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలి

ముందస్తు బెయిల్‌ మంజూరు చేయొద్దు

హైకోర్టుకు సీనియర్‌ న్యాయవాది లూథ్రా వినతి

ముగిసిన వాదనలు.. సెప్టెంబరు 3న తీర్పు

అమరావతి,
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి వ్యవహారంలో.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఆసరాగా చేసుకుని దేశం విడిచి పారిపోయేందుకు నిందితుడు దేవినేని అవినాశ్‌ యత్నించారని, ఆయన్ను ఇమిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్నారని పోలీసుల తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సంబంధించిన ఆధారాలను కోర్టు ముందు ఉంచామన్నారు. తొందరపాటు చర్యలు వద్దని కోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో పిటిషనర్లు దర్యాప్తునకు సహకరించడం లేదని తెలిపారు. అధికారాన్ని వినియోగించి గత మూడేళ్లుగా దర్యాప్తును ప్రభావితం చేశారన్నారు.

దాడి వెనుక కుట్ర కోణాన్ని తేల్చాల్సి ఉందని.. అందుకోసం నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉందన్నారు. వారికి అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తే దర్యాప్తు ముందుకు సాగదన్నారు. వారి నేరచరిత్రను కోర్టు ముందుంచామని.. దానిని పరిగణనలోకి తీసుకుని ముందస్తు బెయిల్‌ మంజూరు చేయొద్దని అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో.. నిర్ణయాన్ని వాయిదా వేసిన న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌.. సెప్టెంబరు 3న తీర్పు వెల్లడిస్తానని ప్రకటించారు. ముందస్తు బెయిల్‌ కోరుతూ పిటిషన్లు వేసినవారిలో వైసీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, వైసీపీ నేత దేవినేని అవినాశ్‌, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌, వైసీపీ కార్యకర్తలు జి.రమేశ్‌, షేక్‌ రబ్బానీ బాషా, చిన్నాబత్తిన వినోద్‌కుమార్‌, మరికొందరు ఉన్నారు.

WhatsApp Image 2024 08 22 at 10.28.47

SAKSHITHA NEWS