సుల్తానాబాద్ అభివృద్ధే ధ్యేయం..
మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం…
–ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు…
సాక్షిత పెద్దపల్లి//సుల్తానాబాద్,
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, సుల్తానాబాద్ మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు.
సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో శానిటేషన్ క్లీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం, 1వ.వార్డు సుగ్లాంపల్లిలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మహిళలకు ఇచ్చిన హామీ మేరకు మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ, సుల్తానాబాద్‌ను సుందర మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు. వార్డుల వారీగా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో పాటు రాజీవ్ రహదారికి ఆనుకుని ఉన్న శ్రీరాంపూర్ రోడ్డును ఆధునికీకరించి సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ పనులన్నింటినీ రాబోయే నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు.
మొదటి విడతలో 1, 2, 13, 14, 15 వార్డుల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసం ఉంచిన ప్రజలు 15 వార్డుల్లో 13 వార్డులను కాంగ్రెస్ పార్టీకి అప్పగించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.
మహిళల ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, స్వయం సహాయక సంఘాల బలోపేతం, ఉపాధి అవకాశాల విస్తరణ, మహిళలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో మరింత ముందుకు సాగేలా ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ అంతటి పుష్పలత, మున్సిపల్ కమిషనర్ టి. రమేష్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు వేగోళం అబ్బయ్య గౌడ్, వార్డు కౌన్సిలర్లు, మహిళా సంఘ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, వార్డుల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
