లింగ నిర్ధారణ పేరుతో అమానుష దందా

Sakshitha news

లింగ నిర్ధారణ పేరుతో అమానుష దందా

కడుపులోనే ఆడశిశువుల హత్యకు తెరలేపుతున్న అక్రమ ముఠాలు!

సాక్షిత ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో

సమాజాన్ని కలవరపరిచే మరో లింగ నిర్ధారణ అక్రమ వ్యవహారం నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో వెలుగుచూసింది. చట్టాలను బేఖాతరు చేస్తూ, ఆర్‌ఎంపీ డాక్టర్ల ముసుగులో గర్భిణీలను లక్ష్యంగా చేసుకుని లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠాను ఇంటెలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం తీవ్ర సంచలనంగా మారింది. పోలీసుల వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని శివాజీనగర్‌లో నివాసం ఉంటున్న ఆర్‌ఎంపీ యాదగిరి తన ఇంటినే కేంద్రంగా చేసుకుని గుట్టుగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు. కేసారం, టేకుమట్ల, కట్టంగూర్ ప్రాంతాలకు చెందిన కొందరు ఆర్‌ఎంపీల సహకారంతో గర్భిణీలను తీసుకొచ్చి ఈ అక్రమ దందాను కొనసాగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన యాదగిరిపై గతంలో కూడా లింగ నిర్ధారణకు సంబంధించిన పలు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ అతడి తీరు మారకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో చివ్వేంల మండలంలో గర్భిణీ మృతి చెందిన కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు ఆర్‌ఎంపీలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో యాదగిరితో పాటు టేకుమట్ల గ్రామానికి చెందిన జాల జానయ్య, కేసారం గ్రామానికి చెందిన భరత్ అనే ఆర్‌ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరితో సంబంధం ఉన్న మరికొందరు పరారీలో ఉన్నట్లు సమాచారం. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

సమాజానికి పెను ముప్పుగా మారుతున్న లింగ నిర్ధారణ దందా

లింగ నిర్ధారణ అనేది కేవలం చట్టవిరుద్ధమైన చర్య మాత్రమే కాదు.. సమాజ సమతుల్యతను దెబ్బతీసే అత్యంత ప్రమాదకర నేరం. ఆడపిల్లలను భారంగా భావించే దురాచారానికి ఇలాంటి అక్రమ ముఠాలు ఊతమివ్వడం వల్ల గర్భంలోనే అమాయక శిశువుల ప్రాణాలు బలవుతున్నాయి. ఇది మానవత్వానికే మచ్చగా నిలుస్తోంది. కొంతమంది ఆర్‌ఎంపీలు వైద్య వృత్తి పవిత్రతను మరిచి డబ్బు కోసం మహిళల ప్రాణాలతో పాటు పుట్టబోయే శిశువుల భవిష్యత్తుతో చెలగాటమాడడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం. గతంలో కేసులు నమోదైనా, జైలుకు వెళ్లి వచ్చినా మళ్లీ అదే నేరాలకు పాల్పడడం చట్టాలపై వారికి ఎంతమాత్రం భయం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

కఠిన చర్యలే శాశ్వత పరిష్కారం

ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై కేవలం కేసులు నమోదు చేయడం మాత్రమే కాకుండా, వేగవంతమైన విచారణ చేపట్టి కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. అక్రమంగా వైద్య సేవల పేరుతో దందాలు చేస్తున్న వారి అనుమతులు, నమోదులు (ఉంటే) రద్దు చేయడంతో పాటు, ఇలాంటి కార్యకలాపాలకు సహకరించే వారందరిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. లింగ నిర్ధారణను అరికట్టడం కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఇలాంటి అక్రమాలపై అధికారులకు సమాచారం అందించాలి. “ఆడపిల్లను కాపాడితేనే సమాజ భవిష్యత్తు సురక్షితం” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పోలీసులు నిందితులను విచారిస్తుండగా, ఈ అక్రమ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.

Scroll to Top