SAKSHITHA NEWS

పేదల ఇళ్ల కూల్చివేతలు అడ్డుకున్న కౌన్సిలర్ చంద్రారెడ్డి
రెవిన్యూ అధికారులపై ఆగ్రహం
-సమస్యను ఎమ్మెల్యే’కు వివరించిన కౌన్సిలర్

           బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ కాలనీలో 59' జీ.వో కింద పేద ప్రజలు నిర్మించుకున్న ఇండ్లను కూల్చడానికి రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోగా వెంటనే స్పందించిన బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి అధికారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అధికారులతో కూల్చివేతలు సరికాదని మాట్లాడారు. జీ.వో కింద ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి భారీగా పెంచిన రుసుమును చెల్లించడం పేద ప్రజలకు సాధ్యం కాదు అన్నారు. కూల్చివేతలు ఆపాలంటూ పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి ఫోన్లో చంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చొరవతో రెవెన్యూ అధికారులు పేదల ఇళ్ల స్థలాల వద్దకు రావద్దని హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు. పేద ప్రజల సమస్యలు పట్టించుకొని, కూల్చివేతలు ఆపివేయడం పట్ల స్థానికులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కి, స్థానిక కౌన్సిలర్ చంద్రారెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆనంద్ కృష్ణ రెడ్డి , కౌన్సిలర్ చంద్రయ్య , రవీందర్ రెడ్డి , పాస్టర్ శంకర్ , రత్నం , డిప్యూటీ తాసిల్దార్, మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది, గాంధీనగర్ వాసులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే చొరవతో కూల్చివేతలకు చెక్

ఇళ్ల క్రమబద్ధీకరణ ప్రక్రియకు సంబంధించి 59 జీ.వో కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు డిమాండ్ నోటీసులు అందజేసిన ఇప్పటివరకు రుసుము చెల్లించకపోవడంపై రెవెన్యూ అధికారులు చర్యలకు దిగారు. ఇప్పటివరకు జీ.వో కింద రుసుము ఎందుకు చెల్లించలేదని అధికారులు ప్రశ్నించారు. గతంలో ఉన్న రుసుము, ప్రస్తుతం ఎక్కువగా పెంచడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారని, అంత డబ్బును కట్టలేని పరిస్థితిలో ఉన్నారని స్థానికులు అధికారులకు నివేదించారు. కాగా ప్రస్తుతం జీ.వో మార్పు జరిగిందని ఇది ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే నోటీసులు ఇవ్వడం జరుగుతుందని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. డిమాండ్ నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరు నిర్ణీత సమయంలో క్రమబద్ధీకరణ రుసుమును చెల్లించాలని అధికారులు సూచించారు. స్థానికులకు రుసుము చెల్లించే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా చంద్రారెడ్డి అధికారులతో వాగ్వాదానికి దిగారు. పెరిగిన రుసుము చెల్లించేందుకు పేద ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కౌన్సిలర్ చంద్రారెడ్డి సమస్యను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తో ఫోన్లో చర్చించిన అనంతరం ఇరవై రోజులపాటు ఇండ్లకు కూల్చివేతలు ఆపాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు కౌన్సిలర్ చంద్రారెడ్డి తెలిపారు. దీంతో అధికారులు అక్కడి నుండి వెనుతిరిగి వెళ్లిపోయారు.


SAKSHITHA NEWS