Convenience to people with new road at West Railway Station
వెస్ట్ రైల్వే స్టేషన్ వద్ద కొత్త రోడ్డుతో ప్రజలకు సౌకర్యవంతం – మేయర్ శిరీష, కమిషనర్ అనుపమ
సాక్షిత : తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ ముందర నుండి కొత్తగా నిర్మించే రోడ్డు వలన ప్రజలకు చాలా సౌకర్యవంతంగా వుంటుందని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి అన్నారు.
తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ ముందర నిర్మించేందుకు ప్రతిపాదిత రోడ్డును సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి ప్రజల సౌకర్యార్ధం అనేక రోడ్లను నిర్మిస్తున్నామని, అందులో భాగంగా తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ ముందర నుండి ఎస్వీ క్యాంపస్ స్కూల్ వెనుకవైపుగా బాలాజీకాలనీ రోడ్డులో కలిసేలా 60 అడుగుల రోడ్డును అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు.
ఈ రోడ్డు వలన వెస్ట్ రైల్వే స్టేషన్ కు వచ్చే వారికి, యూనివర్సిటీ వైపుకు వెల్లె వారికి సౌకర్యవంతంగా వుంటుందన్నారు. తిరుపతి నగరంలో అందరికి అందుబాటులో వుండే ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో పెద్ద స్థాయిలో జరిగే క్రీడలకు, సభలకు వచ్చే క్రీడాకారులకు, ప్రజలకు చాలా ఉపయోగకరమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు, అదనపు కమిషనర్ సునీత, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, పలువురు కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.