నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి శ్రీమతి హరిత ఐఏఎస్*
తుది ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు అధికారులకు సహకరించాలని తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ రాజకీయ పార్టీల నాయకులకు పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషనర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఓటర్ల తుది జాబితా వచ్చే నెల 5 న వస్తుందని, ఇప్పటి వరకు డ్రాఫ్ట్ రోల్ పై అందిన ఫిర్యాదులు, ఆర్జీలను ఈ నెల 26 నాటికీ పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. అర్జీలు పెండింగ్ ఉన్న బి ఎల్ ఓ వారిగా సమీక్షించి ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేసేలా చూడాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు తుది ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు తమవంతుగా సహకరించాలని అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశాల్లో అందించిన ఫిర్యాదులు, అర్జీలను క్రమ పద్ధతిలో రికార్డ్ చేసి, క్షేత్ర స్థాయిలో బిఎల్ఓ లు పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళిశ్వర్ రెడ్డి, ఈ డి టి జీవన్, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.