SAKSHITHA NEWS

సాక్షిత : తిరుపతి నగరపాలక సంస్థలో టీటీడీ చేపడుతున్న అభివృద్ధి పనులపై టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మునిసిపల్ కార్యాలయంలో టీటీడీ, మునిసిపల్ ఇంజనీరింగ్ అధికారులతో నగర మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ లతో కలిసి సమీక్షించారు. మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ నగరంలో జరుగుతున్న పనుల వివరాలను చైర్మెన్ భూమన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ టీటీడీ నిర్వహణలో ఉన్న 13 ప్రధాన రోడ్ల ఆధునీకరణ, డ్రైన్లు, ఫుట్ పాత్ ల నిర్మాణం, ఇతర మరమ్మతులు వంటి అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని టీటీడీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

ఈ పనులకు గానూ 31 కోట్ల రూపాయలు మంజూరు కాగా, ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు నగర పాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగం వెంటనే అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. వీటికి టీటీడీ పాలక మండలి తొలి సమావేశంలో అనుమతులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా వారం రోజుల్లోపే యుద్ద ప్రాతిపదికన హైమాస్ట్ లైట్స్ వేయాలని టీటీడీ అధికారులకు భూమన సూచనలు జారీ చేసారు. ఏఐఆర్ బైపాస్ రోడ్డులో వరదనీరు నిలవకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. చెర్లోపల్లి నుంచి చిత్తూరు, నాయుడుపేట 150 అడుగుల హైవే రోడ్డును అనుసంధానం చేస్తూ వకుళామాత ఆలయం వరకు ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. ఇందుకోసం ముఖ్యంగా భూసేకరణతో పాటు టెండర్ల ప్రక్రియ, ఇతర సాంకేతిక అవరోధాలను అధిగమిచాలని సూచించారు. శ్రీనివాస కళ్యాణ మండపాలు వద్ద ఆర్చిని తొలగిస్తూ, పూర్తి స్థాయిలో ఆధునీకరించాలని, రాకపోకలకు వీలుగా రెండు పెద్ద గేట్లను ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా శ్రీనివాస కల్యాణ మండపాల వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, ఇక్కడి డ్రైన్లునూ ఆధునీకరించి, వరద నీరు పొంగకుండా చర్యలు చేపట్టాలని టీటీడీ ఇంజినీరింగ్ అధికారులను భూమన ఆదేశించారు.

గోవిందరాజ స్వామి కళాశాల చుట్టూ డ్రైన్లు అస్థవ్యస్థంగా కాకుండా, డ్రైన్ వ్యవస్థను మెరుగు పరచాలన్నారు. ఇందులో భాగంగా టీటీడీ, మునిసిపల్ ఇంజినీర్లు సంయుక్తంగా పరిశీలన చేసి కార్యాచరణ రూపొందించాలన్నారు. కొత్తగా చేపట్టనున్న కేటీ రోడ్ ఆధునీకరణ పనుల విషయంలో ముందస్తుగా డెక్ లను ఏర్ఫాటు చేస్తామని భూమన దృష్టికి టీటీడీ ఇంజినీరింగ్‌ అధికారులు తీసుకొచ్చారు. దీనివల్ల వేసిన రోడ్లను, ఫుట్ పాత్ లను పదేపదే పగులగొట్టడం, గుంతలు తీయడం వంటి అవసరాలు తలెత్తకుండా ఉంటాయని టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు వివరించారు.

ఈ నేపథ్యంలోనే శ్రీనివాసం సముదాయం వద్ద ఉన్న అండర్ పాస్ ను శ్రీనివాసం సముదాయం వరకూ పొడిగించాలని, అదేవిధంగా శ్రీనివాసం సముదాయానికి దగ్గరలో శ్రీనివాససేతు వారధి ల్యాండింగ్ ఉన్న కారణంగా ప్రమాదాల నివారణ చర్యల కింద శ్రీనివాసం సముదాయం ప్రధాన గేట్ ను మార్పు చేస్తూ, మరొక కొత్త గేట్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం 4.5 కోట్ల రూపాయలు మంజూరైనట్టు భూమన చెప్పారు. రామానుజం సర్కిల్ వద్ద ఇప్పుడున్న చోటే భారీ సైజుతో రామానుజం వారి మరో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానముల చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఆదేశించారు. ఈ సమావేసంలో తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, టీటీడీ సాంకేతిక సలహాదారు రామచంద్రా రెడ్డి, సీఈ నాగేశ్వర రావు, మునిసిపల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, ఏసి సునీత, డిసి చంధ్రమౌళీశ్వర్ రెడ్డి, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS