ఆయా గ్రామాల ప్రజల అవసరార్ధం సర్వీస్ రోడ్లు నిర్మించాలి.
-మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ .
ఎన్టీఆర్ జిల్లా,
అమరావతి-నాగపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం భూసేకరణ నిమిత్తం భూములు ఇచ్చే రైతులకు సరైన క్రమ పద్ధతిలో నష్టపరిహారం చెల్లించాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు.
విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులతో జరిగిన ముఖ్య సమీక్ష సమావేశంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ రైతులు, ప్రజల తరపున తన వాణి వినిపించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ జి.కొండూరు గ్రామంలో నేషనల్ ఫీల్డ్ హైవే నిమిత్తం ఎకరానికి రూ.59 లక్షలు నష్టపరిహారం ఇస్తున్నారని, దీనికి పక్కనే అనుకుని ఉండే గడ్డమణుగు గ్రామంలో భూసేకరణకు ఎకరానికి రూ.34 లక్షలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. జి.కొండూరు అనే పేరు గడ్డమణుగు కొండూరు అనే పేరు నుంచి ఉద్భభవించిందన్నారు. జి.కొండూరు గడ్డమణుగు రెండు గ్రామాలు కలసి ఉంటాయన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లింపు విషయం ఎంతో ఇబ్బందిగా ఉందన్నారు. ఈ విషయాన్ని గ్రీన్ ఫీల్డ్ హైవే అధికార యంత్రాంగం గమనించాలన్నారు.
అలాగే విజయవాడ నగరానికి పక్కనే ఉన్న పైడూరుపాడు గ్రామంలో ఎకరానికి రూ.30లక్షలే నష్టపరిహారం నిర్ణయించారని అన్నారు. ఈ గ్రామంలో భూముల అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో కమర్షియల్ గా వాణిజ్య పరమైన లావాదేవీలు జరగలేదన్నారు. అందువల్ల ఇక్కడ కూడా రైతుల నుంచి భూసేకరణ నిమిత్తం చాలా తక్కువ నష్ట పరిహారం నిర్ణయించారన్నారు. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడతారన్నారు. ఇక్కడ కూడా నష్టపరిహారం చెల్లించే విషయంలో అధికార యంత్రాంగం పునరాలోచించాలన్నారు.
ముఖ్యంగా సిటీకి అనుబంధంగా ఉండే గ్రామాల్లో సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలన్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ నేషనల్ హైవే పక్కన ఇటు విజయవాడ వైపు, అటు హైదరాబాద్ వైపు సుమారు 20 కిలోమీటర్ల గ్రామాల్లోని ప్రజలు అనుదినం ఏదో ఒక పనికోసం సిటీలోకి వస్తుంటారని, అందుకు అనుగుణంగా విజయవాడ-హైదరాబాద్ హైవేకు సర్వీసు రోడ్లు నిర్మించారన్నారు.
అదే తరహాలో అమరావతి-నాగపూర్ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారికి కూడా ఆయా గ్రామస్తుల అవసరాలు పరిగణనలోకి తీసుకుని సర్వీసు రోడ్లు నిర్మించాలన్నారు. నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే యంత్రాంగం ప్రజలు, రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని వారి ప్రయోజనాలు దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలని శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ గారు కోరారు. ఈ సమావేశంలో కలెక్టర్లు, సహచర ఎమ్మెల్యేలు, నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే అధికారులు తదితరులు పాల్గొన్నారు.