SAKSHITHA NEWS

సాక్షిత : తిరుపతి అర్భన్ పరిధిలోని అర్హులైన ప్రజలకు ఐదు లే అవుట్లలో కేటాయించిన జగనన్న ఇళ్ళ స్థలాల్లో ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ దామలచెరువు హరిత అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో హౌసింగ్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో జరిగిన ప్రత్యేక సమావేశంలో కమిషనర్ హరిత సమీక్షిస్తూ తిరుపతి వాసులకు చిందేపల్లి, సూరప్పకసం, కల్లూరు, ఎం.కొత్తపల్లి, జీపాళెం లే అవుట్లలో కేటాయించిన ఇళ్ళ స్థలాల్లో నిర్మాణాలు ఆలస్యం అవడం గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఇళ్ళ నిర్మాణాలను ప్రతీష్టాత్మకంగా తీసుకొని పేద ప్రజలకు స్థలాలు కేటాయించడమే కాకుండా ఆయా స్థలాల్లో ఇళ్ళను కట్టించి ఇవ్వడానికి సిద్దమైందని, అధికారులు అలసత్వం వహించకుండా పనులను వేగవంతం చేయాలన్నారు. పనులను ఒప్పుకొని అలసత్వం వహిస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలన్నారు.

భవన నిర్మాణ కార్మికులు వస్తే పనులు చేయిస్తామనే సిల్లీ కారణాలు చెపితే చర్యలు తప్పవని హౌసింగ్ ఏయిలకు హెచ్చరికలు జారీ చేసారు. నిర్మాణాల ఆలస్యానికి గల సహేతు కారణాలను తెలపాలని, అవసరమైతే కలెక్టర్ దృష్టికి తీసుకెల్లి పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఇళ్ళ స్థలాల్లో గృహప్రవేశాలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నదని, తిరుపతి అర్భన్ పరిధిలోని ప్రజలకు ఐదు లే అవుట్లలో కేటాయించిన టార్గెట్ ప్రకారం ఇళ్ళను గృహప్రవేశాలకు సిద్దం చేయాలని అధికారులకు కమిషనర్ హరిత ఆదేశాలు జారీ చేసారు. ఈ సమిక్షలో ఉప కమిషనర్ చంధ్రమౌళీశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, హౌసింగ్ పిడి వెంకటేశ్వర రావు , మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, డిఈలు విజయకుమార్ రెడ్డి, రవీంధ్రరెడ్డి, సంజీవ్ కుమార్, మహేష్, దేవిక, గోమతి, హౌసింగ్ అధికారులు మోహన్ రావు, శ్రీనివాసులు, అమ్నెటి సెక్రటరీలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS