SAKSHITHA NEWS

Coming as a yatra for the people.. Revanth Reddy

ప్ర‌జ‌ల కోసం యాత్ర‌గా వ‌స్తున్నా.. రేవంత్ రెడ్డి

భార‌త్ జోడో యాత్ర‌కి కొన‌సాగింపుగా హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర నేటి నుండి ప్రారంభం కానుంది.ఈ మేర‌కు ఈ పాద‌యాత్ర‌ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేయ‌నున్నారు. పాదయాత్ర కోసం ఇంటి నుంచి బయలుదేరుతున్న రేవంత్ రెడ్డికి కూతురు నైమిష హారతి ఇచ్చారు. తన కూతురు హారతి ఇచ్చిన వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ రేవంత్ ఎమోషనల్ అయ్యారు.

నా ప్రజాప్రస్థానంలో యాత్ర కీలక ఘట్టం. సామాన్య రైతు కుటుంబంలో పుట్టాను. ప్రజల ఆశీర్వాదంతో నాయకుడుగా ఎదిగాను. ప్రశ్నించే గొంతుకగా వారి గుండెల్లో స్థానం సంపాదించుకున్నాను. నన్ను నాయకుడ్ని చేసిన ప్రజల కోసం… వారి జీవితాల్లో మార్పు కోసం… యాత్ర గా వస్తున్నా’ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క- సారలమ్మ గద్దె వద్దకు రేవంత్ చేరుకోనున్నారు. వన దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేడారం నుంచి రేవంత్ పాదయాత్రను స్టార్ట్ చేయనున్నారు.


ఇప్పటికే స్థానిక కాంగ్రెస్ నేతలు రేవంత్ పాదయాత్రకు భారీగా ఏర్పాటు చేశారు. భారీగా శ్రేణులు మేడారంకు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మ గద్దె వద్దకు రేవంత్ చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంరతం మధ్యాహ్నం 12 గంటలకు పాదయాత్ర ప్రారంభించనుండగా.. కొత్తూరు, నార్లాపూర్‌ మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు ప్రాజెక్ట్‌నగర్‌కు చేరుకుంటారు. అక్కడ భోజన విరామం తర్వాత యాత్ర తిరిగి పాదయాత్ర ప్రారంభించి సాయంత్రం 4.30కు పస్రా చేరుకుంటారు. పస్రా రోడ్డు జంక్షన్‌లో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు.

ఆ తర్వాత పస్రా నుంచి మరో 10 కి.మీ. పాదయాత్ర నిర్వహిస్తారు. అక్కడి నుంచి వాహనంలో రాత్రి బస చేసే పాలంపేట గ్రామానికి రేవంత్‌రెడ్డి చేరుకుంటారని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. తెలంగాణలో మరో కొద్ది నెలలు మాత్రమే ఎన్నికలకు సమయం ఉండటంతో..

రేవంత్ పాదయాత్రపై కాంగ్రెస్ శ్రేణులు ఆశలు పెట్టుకున్నారు. రేవంత్ పాదయాత్రతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం వస్తుందని భావిస్తున్నారు. నేతల మధ్య విబేధాలు సమసిపోతాయని, కాంగ్రెస్ పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు. రేవంత్ పాదయాత్రలో పలువురు సీనియర్ నేతలు కూడా పాల్గొననున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో సీనియర్ నేతలు కూడా పాదయాత్ర చేసేలా టీ కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందించింది.


SAKSHITHA NEWS