ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన వర్సిటీకి కేంద్ర మంత్రితో కలిసి శంకుస్థాపన చేసిన సీఎం జగన్
సాలూరులో రూ.834 కోట్లతో 561.88 ఎకరాల్లో వర్సిటీ ఏర్పాటు
ఈ వర్సిటీతో గిరిపుత్రుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు
నాలుగేళ్ల మన పాలనలో విద్య వైద్యానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం.. సీఎం జగన్
“గిరిజనుల మిత్రుడిగా, పక్షపాతిగా కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం సాలూరులో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉంది. గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపేలా ఈ విశ్వ విద్యాలయం రూపుదిద్దుకుంటుంది..గిరిజన ప్రాంతానికి ఈ నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి జరిగింది,ఒక్క గిరిజన ప్రాంతంలోనే రెండు మెడికల్ కాలేజీలు, ఒక ట్రైబల్ యూనివర్సీటీ, ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ కనిపిస్తున్నాయి. నాడు- నేడుతో విప్లవాత్మక మార్పుతో గిరిజన విద్యకు కని, విని ఎరుగని రీతిలో మీ బిడ్డ ప్రభుత్వం అడుగులు పడుతున్నాయి”- సీఎం జగన్
సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి సీఎం జగన్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శంకుస్థాపన చేశారు. దశాబ్దాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి, ఎందరో గిరిజనుల జీవితాల్లో విద్యా కాంతులు వెలిగేలా సీఎం జగన్ ప్రత్యేక చొరవతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటవుతుంది. సాలూరులో మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో సుమారు రూ.834 కోట్లతో, 561.88 ఎకరాల్లో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి కేంద్రమంత్రి ప్రధాన్, సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అంతకుముందు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లేఅవుట్ నమూనాను పరిశీలించారు.
అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ గిరిజన విశ్వ విద్యాలయం గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే సత్సంకల్పంతో దత్తిరాజేరు మండలం మర్రివలసలో, మెంటాడ మండలం చినమేడపల్లి పరిధిలో భూసేకరణ, ప్రభుత్వ భూమి కేటాయించడంతో పాటు, ఇప్పటికే ఆయా గ్రామాల్లో యూనివర్సిటీకి భూములిచ్చిన రైతులకు రూ.25.90 కోట్ల పరిహారం అందిచామని, వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు మరో రూ. 28.49 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. విశాఖపట్నం–రాయగడ జాతీయ రహదారికి సమీపంలో, భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లకు అందుబాటులో ఉండేలా స్థలాన్ని ఎంపిక చేసినట్లు వివరించారు.