SAKSHITHA NEWS

Chandrababu: ఎన్నికలు అపహాస్యమవుతున్నా చర్యలు తీసుకోరా?: చంద్రబాబు

అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) అపహాస్యం అవుతుంటే అధికారులు చర్యలకు దిగకపోవడం దారుణమని తెదేపా(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో ఆయన చర్చించారు. పోలింగ్‌లో అక్రమాలు, వైకాపా దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులను పార్టీ నేతలు అధినేతకు వివరించారు.

నేతలు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాల నేపథ్యంలో వైఎస్సార్‌, తిరుపతి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో చోటుచేసుకున్న అక్రమాలు, ఉదయం నుంచి జరిగిన ఘటనలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు, ప్రత్యేక వాహనాల్లో ప్రజలను తరలించి దొంగ ఓట్లు వేయిస్తున్నా యంత్రాంగం మౌనంగా ఉందని ఆయన ఆరోపించారు.

పట్టభద్రులు ఓటు వేయాల్సిన ఈ ఎన్నికల్లో అనర్హులు, నిరక్ష్యరాస్యులతో వైకాపా నేతలు బోగస్‌ ఓట్లు వేయిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. దీనిపై రాజకీయపక్షాలు చేసే ఫిర్యాదులను ఎన్నికల అధికారులు సీరియస్‌గా తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. తిరుపతిలో బోగస్‌ ఓట్లపై అభ్యంతరాలు తెలిపిన తెదేపా నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమన్నారు. మరోవైపు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ ప్రకాశం జిల్లా ఎస్పీకి చంద్రబాబు ఫిర్యాదు చేశారు.


SAKSHITHA NEWS