రూ.8లక్షల ఖరీదైన 6 బైకులను సీజ్ చేసిన పోలీసులు
జల్సాలకు అలవాటు పడే బైకులను చోరీ చేశారు: సీఐ యువరాజు
రాయల్ ఎన్ఫీల్డ్ (బుల్లెట్ బైకులను) చోరీ చేస్తున్న దొంగల ముఠాను మదనపల్లె పోలీసులు అరెస్టు చేశారు. దొంగల ముఠా అరెస్టుకు సంబంధించి మదనపల్లి రెండవ పట్టణ సీఐ యువరాజు, ఎస్సై లు వెంకటసుబ్బయ్య, ఇనయతుల్లా మంగళవారం మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మదనపల్లిలో ఈ నెల 4న బుల్లెట్ బైక్ చోరిపై కంప్లైంట్ అందిందన్నారు. వెంటనే స్పందించి కేసు నమోదు చేసి నాలుగు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందని సీఐ తెలిపారు. ఈ క్రమంలోనే నిందితులు పలమనేరు కు చెందిన స్కూటర్ మెకానిక్ జావీద్, ముజంబల్, పటాన్ ఇర్ఫాన్ ఖాన్, అక్బర్ హుస్సేన్, తంబళ్లపల్లి నియోజకవర్గం లోని పెద్ద తిప్ప సముద్రానికి చెందిన బాలు(21) అనే ముఠాలోని ఐదుగురు యువకులు ఒక గ్యాంగ్ గా ఏర్పడి పలమనేరు, మదనపల్లి ప్రాంతాలలో బుల్లెట్ బైక్ లను దొంగలించి తీసుకెల్లి పొరుగు జిల్లాలలో విక్రయించే వారన్నారు. దొంగలించిన బైకులను విక్రయించ డానికి మదనపల్లి పట్టణం కదిరి- చిత్తూరు జాతీయ రహదారి లోని ఇసుక నూతిపల్లి వద్ద దొంగల ముఠా బైకులతో ఉన్నట్లు అందిన పక్క సమాచారంతో తనతో పాటు ఎస్ఐ లు సిబ్బంది వెంటనే వెళ్లి నిందితులను పట్టుకున్నట్లు చెప్పారు.
పట్టుబడిన దొంగల ముఠా దగ్గర నుంచి సుమారు రూ.ఎనిమిది లక్షలకు పైగా ఖరీదైన ఆరు (రాయల్ ఎన్ ఫీల్డ్ )బుల్లెట్ బైక్ లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి బైక్ లు సీజ్ చేశా మన్నారు. పట్టుబడిన వారిని విచారించి నిందితులు నేరం అంగీకరించడంతో అరెస్టు చేశామని తెలిపారు. వీరంతా జల్సాలకు అలవాటు పడి చిన్న వయసులోనే దొంగతనాలు చేస్తున్నారని తల్లిదండ్రులు పిల్లల పట్ల తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఇదిలా ఉండగా నిందితులను పట్టుకోవడానికి ప్రతిభ కనబరిచిన ఎస్సై లు వెంకటసుబ్బయ్య, ఇనయతుల్లా లతో పాటు సిబ్బంది శంకర్, ప్రసాద్, భద్ర, శివ ను అభినందించటం జరిగిందని సీఐ యువరాజు తెలిపారు…