బోనాలతో కనువిందు చేసిన చిన్నారులు, మహిళా టీచర్లు.
పోతురాజు విన్యాసాలతో నేత్రపర్వంగా బోనాల ఊరేగింపు.
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
బోనాలతో, పోతురాజుల విన్యాసాలతో స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాల చిన్నారులు కనువిందు చేశారు. తెలంగాణ సంస్కృతిలో ప్రధాన ఘట్టమైన బోనాల వేడుకను స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో నేత్రపర్వంగా నిర్వహించారు. సాంప్రదాయ దుస్తుల్లో చిన్నారులు తమ తమ గృహాలనుంచి సాంప్రదాయబద్ధంగా అలంకరించిన బోనాలను స్మార్ట్ కిడ్జ్ పాఠశాలకు తీసుకొని వచ్చారు. పాఠశాలలో బోనాలకు సాంప్రదాయకరంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం బోనాలను నెత్తిన పెట్టుకున్న చిన్నారులు, మహిళా టీచర్లు నగరపురవీధుల్లో బోనాల ఊరేగింపు నిర్వహించారు. పోతురాజు విన్యాసాలు , డప్పు దరువులతో ఈ ఊరేగింపు నేత్ర పర్వంగా జరిగింది. చిన్నారులతోపాటు పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, పాఠశాల ప్రిన్సిపల్ రాణి, మహిళా టీచర్లు బోనాలతో ఈ ఊరేగింపులో భాగస్వాములయ్యారు. సమీపంలోని దేవాలయంలో బోనాలతో మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింత నిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ ప్రపంచంలోనే తెలంగాణ బోనాల వేడుకలకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. తరతరాలుగా మన తెలంగాణలో బోనాల వేడుకలు ప్రాచీన కాలం నుంచి ఇంటింటా నిర్వహించటం జరుగుతుందన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు బోనాల సంబరాలు ప్రతికలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. బోనాల సంబరాల ప్రాధాన్యతను తెలియజేయడానికి తమ పాఠశాలలో బోనాల ఉత్సవాన్ని నిర్వహించామన్నారు. అన్ని మతాల, సాంప్రదాయాల విశిష్టతను తమ పాఠశాలలో విద్యార్థులకు తెలియజేసేలా ప్రత్యేక కార్యక్రమాలు జరుపుతున్నామని కృష్ణ చైతన్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపాల్ రాణి, మహిళా టీచర్లు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.