మీ బిడ్డగా ముందుకొస్తున్నాను ఆశీర్వదించండి : వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి భూమన అభినయ్

Spread the love

సాక్షిత తిరుపతి నగరం*
మీ బిడ్డగా తిరుపతిని మరింత అభివృద్ది చేయాలనే తలంపుతో ముందు కొస్తున్నాను, ఆశ్వీర్వదించి రానున్న ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యేగా గెలిపించాలని తిరుపతి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి భూమన అభినయ్ రెడ్డి విజ్ఞప్తి చేసారు. తిరుపతిలోని 5,6,7,8,31,45వ డివిజన్లతో పాటు ఆడిటర్స్ తో, బైరాగిపట్టెడలోని చాంబర్ ఆఫ్ కామర్స్ వారి కార్యలయంలో సిమెంట్ అసోసియేషన్ వారితో భూమన అభినయ్ రెడ్డి ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభినయ్ రెడ్డి మాట్లాడుతూ గత ఏ ప్రభుత్వాలకు సాధ్యం కాని విధంగా రూ.1300 కోట్లతో తిరుపతి నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయగలిగామంటే అది కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికే ఆ ఘనత దక్కుతుందన్నారు. తిరుపతిలో ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు 18 మాస్టర్ ప్లాన్ రోడ్లును నిర్మించడం జరిగిందన్నారు. ఇక ఫ్రీ లెప్ట్ లు, ప్రధాన కూడళ్ళను ఆధ్యాత్మిక, సామాజిక విగ్రహాలతో, విద్యుత్ అలంకరణలతో తిరుపతి రూపురేఖలే మార్చడం జరిగిందన్నారు.

ముందు ముందు తిరుపతిని క్రైం ఫ్రీ సిటీగా మార్చనున్నట్లు తెలిపారు. అందుకోసం తిరుపతి నగరంలో 5వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దాంతో పాటు ఐటీ హబ్ తీసుకొచ్చి తిరుపతిలో నిరుద్యోగులు అనేవారే లేకుండా చేస్తామన్నారు. అందరూ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చినప్పుడు ఓట్లు వేసి గెలిపిస్తే అవి చేస్తాం, ఇవి చేస్తామంటూ ప్రగల్బాలు పలుకుతారన్నారు. అయితే తాము అభివృద్ధి చేశాకే ప్రజల్లోకి వచ్చి ధైర్యంగా ఓట్లు అడుగుతున్నామన్నారు. జగనన్న చేసిన మంచిని గుర్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొచ్చి ఓట్లు అడిగేందుకు వచ్చే మాయగాళ్ళను నమ్మవద్దని హెచ్చరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాల్లో కొన్నైనా అందించగలరా అని ప్రశ్నించారు. వారికి అబద్దాలు చెప్పడం తప్ప ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మెన్ కేతం జయచంద్రారెడ్డి, కార్పొరేటర్లు పుల్లూరు అమరనాధ్ రెడ్డి, అనీష్ కుమార్ రాయల్, రమేష్, పార్టీ నాయకులు ఊటుగుంట మోహన్, బొమ్మగుంట రవి, బండ్ల చంద్రశేఖర్ రాయల్, రాజేంద్ర, వర్మ, మునిరత్నం, శివ వెంకటరమణరాజు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page