SAKSHITHA NEWS

BJP leader, Medak MP Raghunandan Rao's sensational comments on KCR

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌పై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ED) కేసు నమోదు చేసిందని తెలిపారు.
అంతేగాక, ఇక, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డిపైనా ఈడీ ప్రభావం ఉంటుందన్నారు.

మెదక్‌ పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన విజయోత్సవ సభలో రఘునందన్‌ రావు పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో డబ్బుతో గెలవలేరని, ప్రజలు నిరూపించారని ఆయన తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో రూ.500 కోట్లు ఖర్చుపెట్టిన వెంకట్రామిరెడ్డి గెలవలేదని రఘునందన్‌రావు వ్యాఖ్యానించారు. మెదక్ పార్లమెంట్‌ స్థానం నుంచి గెలిచి, ప్రధాని మోడీకి గిఫ్ట్ ఇచ్చామన్నారు.

వెంకట్రామిరెడ్డి రూ.లక్ష కోట్లకు అధిపతని రఘునందన్ రావు ఆరోపించారు. రూ.లక్ష కోట్లున్న వెంకట్రామిరెడ్డి ఓటుకు ఎంత విలువ ఉంటుందో.. పూటకు బువ్వ లేని బీజేపీ కార్యకర్త ఓటుకు కూడా అంతే విలువ ఉంటుందని చెప్పుకొచ్చారు. బుధవారం సిద్దిపేటలో జరిగిన సమావేశానికి తాను ఎంపీగా గెలిచి వస్తానని.. హరీశ్‌రావు కలగనలేదని రఘునందన్‌రావు వ్యాఖ్యానించారు.

ఎంపీగా తనను ఓడించాలని బీఆర్ఎస్‌ చేసిన ప్రయత్నాలన్ని బెడిసి కొట్టాయని రఘునందన్ రావు తెలిపారు. ప్రతి సమస్యను భారత పార్లమెంట్‌లో వినిపిస్తామని చెప్పారు. తాను మాటల మనిషి కాదని, చేతల మనిషినని నిరూపిస్తానని స్పష్టం చేశారు. అజంతా, రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అక్కన్నపేట, చేగుంట స్టేషన్లలో ఆపేవిధంగా సౌత్ రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

తన గెలుపు బీజేపీ కార్యకర్తల కృషి ఫలితమేనని చెప్పారు. తనను మెదక్ ఎంపీగా గెలిపించిన ప్రజలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు రఘునందన్ రావు. త్వరలో రాబోయే మెదక్ మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరాలని రఘునంద్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

WhatsApp Image 2024 06 14 at 09.40.18

SAKSHITHA NEWS