తిరుమల తిరుపతి దేవస్థానములకి ఇప్పటి వరకు ఎంతోమంది చైర్మెన్లు వచ్చారు గాని, వాళ్ళల్లో ప్రత్యేక ముద్ర వేసిన చైర్మెన్ గా భూమన కరుణాకర రెడ్డి నిలిచారని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. తిరుపతి పద్మావతి పురంలోని భూమన కరుణాకర రెడ్డి నివాసం వద్ద జరిగిన సుబ్రమణ్యం స్వామి యాగంలో పాల్గొన్న విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి మాట్లాడుతూ ఈ రోజు మన భూమన కరుణాకర రెడ్డి ఇంటికి రావడం మాకు చాలా ఆనందంగా ఉందని, కరుణాకర రెడ్డి అంటే మాకు చాలా అభిమానమని, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతో మంది చైర్మన్లు వచ్చారు గానీ, వాళ్లలో ప్రత్యేక ముద్ర వేసిన చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఒక్కరే అని తెలియజేసారు. మా స్వలాభం కోసం ఇలా చెప్పడంలేదని,
తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా, నిజాయితీగా మేము చెబుతున్నామని, ఒకప్పుడు దళిత వాడలు, గిరిజన వాడల్లో మత మార్పిడులు జరిగే రోజుల్లో, మత మార్పిడులకు వ్యతిరేకంగా భారతదేశంలోనే ఓ సరి కొత్త పంథా తీసుకొచ్చింది భూమన కరుణాకర రెడ్డి ఒక్కరేనని, చాలా పెద్ద పీఠాలు అని చెప్పుకున్న వాళ్లు కూడా కులాల అభిమానంతో అది కుదరదని చెప్పినా, అది కుదరదంటూ దళిత వాడలలో గుండె బలంతో దళిత గోవిందం, కల్యాణమస్తు వంటి కార్యక్రమాలను కరుణాకర రెడ్డి నిర్వహించారని గుర్తు చేసారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేదపాఠశాలను యూనివర్సిటీగా మార్చారని, గిరిజన ప్రాంతాలలో భజన మండళ్లు ఏర్పాటు చేసి మతమార్పిడులను అడ్డుకున్నారని, అత్యున్నత హైందవ జాతికి రెండు రాష్ట్రాల్లో ఎన్నో సేవలు అందించిన కరుణాకర రెడ్డి అంటే మాకు చాలా అత్యంత ప్రాణమన్నారు. రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వైభవాన్ని చాలా అద్భుతంగా నడిపించింది కరుణాకర రెడ్డే అని, అన్నమయ్య విగ్రహాన్ని గొప్పగా ప్రతిష్టాపన చేసి అన్నమయ్య గొప్పతనాన్ని వెలికి తీయడం, తరిగొండ వెంగమాంబ ఉత్సవాలు కొత్తగా నిర్వహించడం జరిగిందని, వెంకటేశ్వర స్వామి అద్భుత జ్యోతి అనేది కరుణాకర రెడ్డి హృదయంలో ఉంది కనుకే, ఎంతో కష్టమైనా కరుణాకర రెడ్డిని చూసేందుకు ఇంత దూరం రాగలిగాం అని అన్నారు.
షణ్ముఖ యాగం జరిపిస్తూ, పూర్ణాహుతికి మమ్మల్ని పిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. టీటీడీ ఇవో ధర్మారెడ్డి గురించి మాట్లాడుతూ ఎంతో నిబద్ధతతో, ఎంతో అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారని, ధర్మారెడ్డి తనకు వ్యతిరేకంగా వస్తున్న పిచ్చి పిచ్చి రాతలను పట్టించు కోకుండా, ఆధ్యాత్మిక జీవనం సాగిస్తున్నారని, ధార్మికమైన శక్తిని పుంజుకొని ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నడిపిస్తున్నారని, టీటీడీలో జరిగే కార్యక్రమాల్లో చైర్మెన్ కు అప్పుడూ, ఇప్పుడూ ఈఓ ధర్మారెడ్డి చేదోడు వాదోడుగా వుంట్టున్నారని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు అన్నారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో టీటీడీ చైర్మెన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి దంపతులు, వారి కుమారుడు తిరుపతి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి దంపతులు, వారి కుటుంబసభ్యులు, టీటీడీ ఇవో ధర్మారెడ్డి, శ్వేతా డైరెక్టర్ భూమన సుబ్రమణ్యం రెడ్డి పాల్గొన్నారు.