ప్రశాంతతకు నిలయంగా భక్త రామదాసు ధ్యాన మందిరం
ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తాం
రామదాసు ధ్యాన మందిర ప్రారంభోత్సవంలో మంత్రి పొంగులేటి
పాత జ్ఞాపకాలను పదిలం చేయడం సంతోషకరం: ఎంపీ రఘురాం రెడ్డి
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
శ్రీ సీతారాముల వారి జీవిత విశేషాలు, భక్త రామదాసు భక్తిని కళ్ళకు కట్టినట్లు కుడ్య చిత్రాలతో కూడిన భక్త రామదాసు ధ్యాన మందిరం ప్రశాంతతకు నిలయంగా ఉందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రూ.3 కోట్ల వ్యయంతో భక్త రామదాసు జన్మస్థలం నేలకొండపల్లిలో నిర్మించిన ధ్యాన మందిరాన్ని మంత్రి పొంగులేటి ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలల సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించి, ధ్యాన మందిరంలోని నిర్మాణ శైలిని ఆసక్తిగా పరిశీలించారు.
కొన్ని శతాబ్దాల కిందట భక్త రామదాసు జీవించిన గృహంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాములోరి మీద ఉన్న అపారమైన దైవ భక్తితో భద్రాచలంలో దేవాలయాన్ని కట్టించారని.. అంతటి మహా భక్తుని ఆడిటోరియం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. భక్త రామదాసు నిర్వాహక కమిటీ బాధ్యుల సూచన మేరకు..ఈ ఆడిటోరియం చుట్టూ ప్రహరీ నిర్మిస్తామని అభయమిచ్చారు. నేలకొండపల్లిని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ఇక్కడ బౌద్ధ స్థూపాన్ని అభివృద్ధి చేస్తామని, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చేలా చూస్తామని తెలిపారు. మార్పు రావాలని ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని, వారి సంక్షేమమే తమ లక్ష్యం అని అన్నారు. రాములోరి కోసం భక్తరామదాసు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలుసనీ..ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. అన్ని వర్గాల సంక్షేమం కోసం తాము నిరంతరం పనిచేస్తామని ప్రకటించారు.
ఇది చాలా శుభ పరిణామం..: ఖమ్మం ఎంపీ
శతాబ్దాల కిందట భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి దేవస్థానాన్ని కట్టించిన భక్త రామదాసు పేరిట ధ్యాన మందిరాన్ని నిర్మించడం ఎంతో శుభ పరిణామం అని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి అన్నారు. భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.