SAKSHITHA NEWS

At the time of the letter of the Union Health Department… Jodoyatra to Delhi

కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ వేళ… దిల్లీకి జోడోయాత్ర

దిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో సాగుతోన్న భారత్ జోడో యాత్ర శనివారం దేశ రాజధాని దిల్లీలోకి ప్రవేశించింది. మళ్లీ కొవిడ్‌ వ్యాప్తి ముప్పు ఉన్న దృష్ట్యా నిబంధనలు పాటించకపోతే జోడో యాత్రను నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ రాహుల్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈ యాత్రను అడ్డుకునేందుకు కేంద్రం సాకులు వెతుకుతోందన్న కాంగ్రెస్‌.. దానిని కొనసాగిస్తోంది.

ఇప్పటికే వందరోజులు పూర్తి చేసుకున్న ఈ యాత్ర.. తాజాగా హరియాణా నుంచి దిల్లీకి చేరుకుంది. ఇక్కడ రాహుల్ వెంట పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్‌ వాద్రా, పార్టీ నేతలు తోడుగా వచ్చారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ మరోసారి ప్రేమ ప్రస్తావన తెచ్చారు. ‘దేశంలోని సామాన్య ప్రజలు ప్రస్తుతం ప్రేమ గురించి మాట్లాడుతున్నారు

.

ప్రతి రాష్ట్రంలో లక్షల మంది ఈ యాత్రలో కలిసి నడుస్తున్నారు. మీ ద్వేషం అనే బజార్‌లో ప్రేమ దుకాణాలను తెరిచేందుకు ఇక్కడ ఉన్నామని ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపా వ్యక్తులకు నేను చెప్పాను. ఇంకో విషయం ఏంటంటే..కొత్త వేరియంట్‌ కలవరం వేళ భాజపా పలు రాష్ట్రాల్లో యాత్రలు చేపడుతోంది. కానీ ఆరోగ్య శాఖ మాత్రం మనకు లేఖలు పంపుతోంది’ అని విమర్శించారు.

జోడో యాత్రకు లభిస్తోన్న ఆదరణ చూసి భాజపా భయపడుతోందని, అందుకే దీనిని నిలిపివేయాలని చూస్తోందని కాంగ్రెస్ మండిపడింది.

ఇదిలా ఉంటే..రాజస్థాన్‌లో ‘జన్‌ ఆక్రోశ్‌ యాత్ర’పై భారతీయ జనతా పార్టీ యూటర్న్‌ తీసుకున్న సంగతి తెలిసిందే. చైనా సహా పలు దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ యాత్రను రద్దు చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయాన్ని మార్చుకోవడం గమనార్హం.

కొవిడ్‌ నిబంధనలను అనుసరించి యాత్రను షెడ్యూల్‌ ప్రకారం కొనసాగించనున్నట్లు భాజపా వెల్లడించింది. వచ్చే ఏడాది రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డిసెంబరు 1న భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఈ యాత్రను ప్రారంభించారు.


SAKSHITHA NEWS