ప్రభుత్వ నిధులే కాకుండా, వివిధ సంస్థల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) కింద నిధులు తెప్పించి జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి……….. నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి .
పెండింగ్ లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులన వేగంగా పూర్తిచేయాలని అధికారులకు విజ్ఞప్తి…………. ఎమ్మెల్యే మెగా రెడ్డి
సాక్షిత వనపర్తి
ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన అనంతరం, ఎంపీ మల్లు రవి స్థానిక ఎమ్మెల్యే తుడి మేగా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభితో కలిసి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ వివిధ సంస్థల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు తెప్పించి జిల్లాను అభివృద్ధి చేసేందుకు ఎంతో శ్రమిస్తున్నట్లు చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున సి ఎస్ ఆర్ కింద జిల్లాలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు అందరికీ క్యూఆర్ కోడ్ ద్వారా పాఠాలను చదువుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు, అదేవిధంగా మరో సంస్థ ద్వారా సి ఎస్ ఆర్ కింద జిల్లాలో లైబ్రరీ కం రీడింగ్ రూమ్ లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు.
విద్యుత్ సౌకర్యం బాగుంటేనే పంటలు బాగా పండుతాయి అనే ఉద్దేశంతోనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వనపర్తి జిల్లాలో రెండు సబ్ స్టేషన్లకు ప్రారంభోత్సవాలు, ఏడు నూతన సబ్ స్టేషన్ లకు శంకుస్థాపనలు చేయడం జరిగిందని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన ఖరారు అయిన తర్వాత అతి తక్కువ సమయం ఉన్నప్పటికీ అధికారులు ఎంతో శ్రద్ధతో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసి సబ్ స్టేషన్ ల శంకుస్థాపనకు సహకరించారని ప్రశంసించారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న నీటిపారుదలకు సంబంధించిన ప్రాజెక్టులను సైతం వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇవే కాకుండా, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మరుగుదొడ్లు సహా ఇతర సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం శ్రద్ధ చూపుతున్నట్లు చెప్పారు. త్వరలోనే వనపర్తి లో యువతకు ఉపాధి, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అనేక కంపెనీలతో త్వరలో జాబ్ మేళా నిర్వహించడంతోపాటు, లోన్ మేలా కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా జిల్లాలో సోషల్ వెల్ఫేర్ కు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లులను సైతం మంజూరు చేపిస్తానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే మెగా రెడ్డి మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ కు విజ్ఞప్తి చేశారు. బుద్ధారం, గణపురం కాల్వల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. అదేవిధంగా, బుద్ధారం స్టేజి 2, గొల్లపల్లి, ఏదుల రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వానికి త్వరగా ప్రతిపాదనలు పంపి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 29 లేదా 30 తేదీల్లో వనపర్తి నియోజకవర్గం లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వనపర్తి నియోజకవర్గం లోని వీరాయిపల్లిలో వేరుశనగ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటనను విజయవంతం చేసిన అధికారులకు అభినందనలు తెలియజేశారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం పనితీరు పట్ల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. త్వరలోనే జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి శంకుస్థాపన జరగనుందని తెలిపారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ జీ విజయభాస్కర్ రెడ్డి , డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.