Actions will be taken if the rules are not followed
నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు
సూర్యాపేట మెడికల్ క్లినిక్ లలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారుల దాడులు
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : అనుమతులు లేకుండా నిబంధనలు పాటించకుండా ప్రజారోగ్యానికి నష్టం కలిగించే మెడికల్ క్లినిక్లపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు, లీగల్ అండ్ ఆంటీ క్వకరి మెంబర్ డాక్టర్ ఎం.శేషు మాధవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పలు మెడికల్ క్లినిక్ లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆదేశాల మేరకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి విద్యార్హతలు లేకుండా ఫస్ట్ ఏయిడ్ సెంటర్లను మెడికల్ క్లినిక్లుగా మార్చి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మోతాదుకు మించి యాంటీబయటిక్స్, స్టెరాయిడ్స్ ఇస్తున్నట్లు తెలుస్తుందన్నారు.దీంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడడంతో కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ క్లినికులు నిర్వహించే వారిపై 34, 54 ఎన్.ఎం.సి యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడంతో పాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆదేశాల మేరకు లక్ష నుంచి 5 లక్షల వరకు జరిమానా, సంవత్సరం పాటు జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. ప్రజలు సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలలో కానీ,ఎంబిబిఎస్ చదివిన వైద్యుల వద్ద కానీ చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ వి.నరేష్ సిబ్బంది తదితరులు ఉన్నారు.