ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెలా చివరి దేశ ప్రజలనుద్దేశించి చేసే రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’ ఎంతో ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే..
వచ్చే రెండు, మూడు నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఈ కార్యక్రమానికి మూడు నెలల పాటు విరామం ఇస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. తాజాగా 110వ ఎపిసోడ్లో ప్రసంగించిన ఆయన.. గతంలో మాదిరిగానే ఈ మార్చిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు..
‘ఇప్పటివరకు నిర్వహించిన 110 ఎపిసోడ్లు ప్రభుత్వంతో ఎటువంటి ప్రమేయం లేకుండా నిర్వహించాం. దేశ సామూహిక శక్తి, విజయానికి ఈ ప్రసారం అంకితం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది ప్రజల కార్యక్రమమని, ప్రజల కోసం ప్రజలచే రూపుదిద్దుకుందని అన్నారు. తదుపరి నిర్వహించేది 111వ ఎపిసోడ్ అని.. ఈ సంఖ్యకు విశిష్టత ఉందన్నారు. ఇంతకంటే గొప్ప విషయమేముంటుందని చెప్పారు. ఇదిలా ఉంటే, 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి విరామం ఇచ్చిన విషయం తెలిసిందే..