తిరుపతి నగరపాలక సంస్థ పూర్తి సహకారం – మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్
తిరుపతి నగరం
తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగే వినాయక నిమజ్జన కార్యక్రమానికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానములు ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. తిరుపతిలో జరిగే వినాయక నిమజ్జనానికి కావల్సిన ఏర్పాట్లుపై తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో టీటీడి చైర్మెన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి సమక్షంలో వివిధ సంస్థలకు చెందిన ప్రభుత్వ అధికారులు, వినాయక నిమజ్జన కమిటీ సభ్యుల సమక్షంలో శుక్రవారం తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ పాల్గొని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
ఈ సంధర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ జరిగే సెప్టెంబరు 22వ తేదీ వినాయక నిమజ్జనాలు జరగకుండా వినాయక నిమజ్జన కమిటీ ప్రతినిధులు, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగేందుకు గత ఏడాది లాగే ఈ సారి కూడా టీటీడీ వైపు నుండి అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. వినాయక సాగర్ వద్ద భక్తులందరికీ తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కుంకుమ, కంకణాలు అందిస్తామని చెప్పారు. తిరుమలలో స్వామి వారి గరుడ సేవ జరిగే రోజునే వినాయక విగ్రహాల ఐదవ రోజు నిమజ్జనం వస్తోందన్నారు.
తిరుమలకు గత ఏడాది కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. అధికార యంత్రాంగం తిరుమలలో ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉన్నందున 5 వ రోజు వినాయక విగ్రహ నిమజ్జనాలు లేకుండా చర్యలు తీసుకోవాలని నిమజ్జన కమిటీ, అధికారులకు కరుణాకర రెడ్డి సూచించారు. వినాయక చవితి సందర్బంగా వినాయక సాగర్ వద్ద టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అవసరమైన మేరకు ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం పోలీస్, తుడ, రెవెన్యూ, ఎస్పీడీసీఎల్ ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ మాట్లాడుతూ గత సంవత్సరం లాగానే ఈసారి కూడా వినాయక నిమజ్జనం రోజు నగరపాలక సంస్థలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం మొదటగా నిమజ్జనానికి తీసుకు రావడం జరుగుతుందన్నారు.
వినాయక నిమజ్జనానికి వినాయక సాగర్లో మంచి నీటిని నింపడంతో బాటు అన్ని వసతులు కల్పిస్తామని మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, ఆర్డీవో కనక నరసారెడ్డి, టీటీడీ ఎస్ఈ సత్యనారాయణ, అదనపు ఎస్పీ కులశేఖర్ తో పాటు వివిధ శాఖల అధికారులు, నిమజ్జన కమిటీ ప్రతినిధులు సామంచి శ్రీనివాస్, కార్పొ రేటర్ ఆర్సీ మునికృష్ణ, మాంగాటి గోపాలరెడ్డి, గుండాల గోపినాథ్, కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు, డి.ఎస్.పిలు, సిఐలు తదితరులు పాల్గొన్నారు.