ఈ నెల 21తో సంవత్సరం పూర్తి చేసుకుంటున్న ఐదు రూపాయల భోజనం
ఎందరో అభాగ్యులకు ఆసరా ఈ ఐదు రూపాయల భోజనం
బీకేఎంఆర్ క్యాంటీన్ ని సందర్శించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం రైతులు, ప్రజలు, వ్యాపారులు, వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు ప్రతిరోజు వచ్చి వెళ్తుంటారు. వారు మధ్యాహ్న సమయంలో ఆకలి తీర్చుకునేందుకు హోటళ్లకు వెళ్లి వందల రూపాయల డబ్బులు వెచ్చించి ఆకలి తీర్చుకునేందుకు నానా ఇబ్బందులు పడేవారు. మరికొందరు తెచ్చుకున్న డబ్బులు సరుకుల కొనుగోలుకు సరిపోవడంతో ఖాళీ కడుపులతో గ్రామాలకు పయనమయ్యే వారు… అలాంటి వారి కోసం, పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న యాచకులు, పిల్లల ఆదరణ కరువైన తల్లిదండ్రుల కోసం, రోజువారి కూలీలు, కార్మికులకు ఎలాగైనా వారికి ఒక్కపూట అయిన కడుపు నిండా భోజనం అందించాలని తలంచిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గత ఏడాది సెప్టెంబర్ 21న తన జన్మదినం సందర్భంగా చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో వైఎస్సార్ సర్కిల్ నందు బీకేఎంఆర్ క్యాంటీన్ ప్రారంభించారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1నుంచి 2గంటల వరకు కేవలం రూ. 5లకే ప్రతి రోజు సుమారు 600 మంది (సోమవారం రోజు అదనంగా మరో 300మందికి ) కడుపునిండా భోజనం అందిస్తూ ఆకలితో ఉన్న వారికి అన్నదాతగా కొనియాడబడుతున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన ప్రతి పుట్టినరోజు రోజు ఎదో ఒక చిరస్థాయి సామాజిక కార్యక్రమం చేపట్టి నియోజకవర్గ ప్రజల దృష్టిలో ఆపద్బాంధవుడిగా వెలుగొందుతున్నారు.
ఈ ఐదు రూపాయల భోజనం హోటల్ ప్రారంభించి ఈ నెల 21 నాటికి దిగ్విజయంగా సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నాగర్ దొడ్డి వెంకట్రాములు హోటల్ ని సందర్శించి అక్కడ ప్రజలకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించి ప్రజలతో కలిసి మధ్యాహ్న భోజనం అక్కడే చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకలితో ఉన్న వారికి రూ. 5లకే కడుపునిండా భోజనం అందించడం అనేది ఒక మహోన్నతమైన ఆలోచన అని, అలాంటి ఆలోచన బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కలగడం, దాన్ని వెంటనే అమలు చేసి ప్రజల నీరాజనాలు అందుకోవడం హర్షణీయం అన్నారు. ఇలాంటి కొత్త రకమైన సేవా కార్యక్రమాలు మున్ముందు ఇంకా చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన వెంట బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.