ఆడిటోరియం పనులు పూర్తి… త్వరలోనే ప్రారంభిస్తాం..
*కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్
సాక్షిత : స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో నిర్మిస్తున్న ఆడిటోరియం నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని త్వరలోనే ప్రారంభించి నగరవాసులకు అందుబాటులోనికి తెస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అన్నారు. ఉదయం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఆడిటోరియం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించడంలో భాగంగా స్మార్ట్ సిటీ నిధులతో పలు అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు.
అందులో భాగంగానే సుమారు 40 కోట్ల రూపాయల స్మార్ట్ సిటీ నిధులతో తుడా కార్యాలయం సమీపంలో 600మంది కూర్చుని కార్యక్రమాలు వీక్షించేందుకు వీలుగా ఆడిటోరియం, కమాండ్ కంట్రోల్ సెంటర్, ఆర్ట్ స్టూడియో, డిజైన్ స్టూడియో ను నిర్మిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు ఆడిటోరియం, ఆర్ట్ స్టూడియో పనులు పూర్తి అయ్యాయని, త్వరలోనే ప్రారంభించి ప్రజలు అందుబాటులోకి తెస్తామని అన్నారు. ఈ ఆడిటోరియం రాకతో నగరంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించు కోవడానికి ఎంతో బాగుంటుందని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్ చంద్రశేఖర్, డి.ఈ. దేవిక, ఏఈకాం ప్రతినిదులు బాలాజీ, అనిల్, తదితరులు ఉన్నారు.