SAKSHITHA NEWS

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే నాణేనికి బొమ్మా, బొరుసు లాంటివి

కాంగ్రెస్ కు ఫండింగ్ చేస్తున్నది కేసీఆరే

  • ఎన్ వి సుభాష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

బండి సంజయ్ పై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి సుభాష్. బండి సంజయ్ కి ఎవరో హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదన్న సుభాష్…. బిజెపిలో ఎవరి ప్రాధాన్యత వారికే ఉంటుందని పేర్కొన్నారు. బండి సంజయ్ పాదయాత్రలతో… అధికార బీఆర్ఎస్, దాని బీ టీమ్ అయిన కాంగ్రెస్ కు ముచ్చెమటలు పట్టాయని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల చీకటి ఒప్పందం జగమెరిగిన రహస్యమేనని సుభాష్ వెల్లడించారు. ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కేసీఆర్ డబ్బులు పంపించారని ఆరోపించారు.
2014 నుంచి కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలోకి వెళ్లారో… ప్రజలకు తెలుసన్నారు. అలానే కాంగ్రెస్ లో గెలిచే ఎమ్మెల్యేలు… చివరికి వెళ్ళేది బీఆర్ఎస్ పార్టీలోకేనని పునరుద్ఘాటించారు
ఎన్.వి సుభాష్. ‘బీఆర్ఎస్, కాంగ్రెస్’ పార్టీలు ఒకే నాణేనికి ఉన్న బొమ్మా, బొరుసు లాంటివని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చివరికి కాంగ్రెస్ పార్టీలో టిపిసిసి సహా… ఎవరికి ఏ పదవులు కట్టబెట్టాలో డిసైడ్ చేసేది ప్రగతి భవన్ నుంచి కేసీఆరేనని చెప్పుకొచ్చారు.
ఇకపోతే… తెలంగాణ లో కాంగ్రెస్ కు ఓటేస్తే… బీఆర్ఎస్ కు ఓటు వేసినట్టేనని… ఈ విషయంలో ప్రజలంతా ఒకసారి ఆలోచన చేయాలని కోరారు. మరోవైపు బండి సంజయ్ పాదయాత్రతో బిజెపికి పెరిగిన గ్రాఫ్ ను చూసి కేసీఆర్ గుండెల్లో వణుకు మొదలైందని.. అందుకే కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు ఎన్ వి సుభాష్.ఇవన్నీ తెలిసినా కూడా… పొన్నం ప్రభాకర్ ఏమీ తెలియనట్టు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో 30 మంది అభ్యర్థులకి కేసీఆర్ ఫండింగ్ చేస్తున్నారని బండి సంజయ్ అన్నది వందకి వందశాతం నిజమని నొక్కిచెప్పారు. మరోవైపు తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఏకైక పార్టీ మోడీ నేతృత్వంలోని బీజేపీనే అని… మోడీ పాలనలో అవినీతిపరులు జైలుకు వెళ్లడం ఖాయం. అది ఎవరైనా సరే అని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ వి సుభాష్ వెల్లడించారు.


SAKSHITHA NEWS