చిట్యాల సాక్షిత ప్రతినిధి
సమాజంలో వేసే ప్రతి అడుగుకూ అంగవైకల్యం అడ్డుకారాదని, మనోస్థెర్యంతో ముందుకెళ్లాలనే యోచనతో దివ్యాంగులకు భవిత కేంద్రాలు శిక్షణనందిస్తున్నాయని వీటిని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి కూకుట్ల నర్సింహా అన్నారు.
చిట్యాల మండల కేంద్రంలోని భవిత కేంద్రం ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక అవసరాలు కలిగిన ఐదేళ్ల పైబడి 18 ఏళ్ల లోపు పిల్లలకు సమగ్ర శిక్షా ద్వారా భవిత కేంద్రాల్లో నిత్యకృత్యాలతో పాటు విద్య, స్పీచ్‌థెరపీ, ఫిజియోథెరపీ తదితర అంశాల్లో మెలకువలు నేర్పుతున్నట్లు చెప్పారు. పుట్టుకతో, చిన్న వయస్సులో వైకల్యం ఏర్పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి కూడా ఈకేంద్రాలు భరోసా ఇస్తున్నాయని దివ్యాంగుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా పిల్లలను భవిత కేంద్రాలలో చేర్పిస్తే సామాన్యుల్లాగే మెలిగేలా ఈ కేంద్రాల్లో తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భవిత కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు బోయ శ్రీనివాసులు, ఆవుల గీత, సిఆర్పిలు జాన్ కిషోర్, జయకాంత్, ఎంఐఎస్ సరిత తదితరులు పాల్గొన్నారు.