సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్;
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ప్రగతి, సంక్షేమంలో మన ఖమ్మంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేశారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. సుమారు రూ.2 వేల కోట్ల పైచిలుకు నిధులతో ఖమ్మం నగరం హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి సాధించింది. దీంతో పాటు నగరపాలక సంస్థకు ఏటా విడుదలవుతున్న రూ.100 కోట్ల నిధులతో పాలకవర్గం నగరంలో అంతర్గత రహదారులు, నీటి సరఫరా, డ్రైన్లు, సైడ్ కాలువల నిర్మాణాలు చేపడుతున్నది. రూ.50 కోట్లతో నగరంలో పలుచోట్ల ఏసీ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాలు పూర్తి చేయించింది.
రూ.4 కోట్లతో నగరంలోని లకారం చెరువు సుందరీకరణ పనులు పూర్తయ్యాయి. రూ.100 కోట్ల నిధులతో గోళ్లపాడు చానల్ పనులు పూర్తయ్యాయి. చానల్‌పై సుందర వనాలు అందుబాటులోకి వచ్చాయి. రూ.70 కోట్లతో ధంసలాపురం ఆర్వోబీ అందుబాటులోకి వచ్చింది. ముస్తాఫానగర్ నుంచి ధంసలాపురం గేటు వరకు నాలుగు లైన్ల రహదారి పనులు పూర్తయ్యాయి. నగరంలోని టేకులపల్లిలో 1,210 మందికి డబుల్ బెడ్ రూం ఇండ్ల అప్పగింత జరిగింది.
నాటి నుంచి నేటి వరకు పట్టణ జనాభా పెరుగుతూ వస్తున్నది. క్రమంగా వాహనాల వినియోగం పెరిగింది. ట్రాఫిక్ సమస్యలు నిత్యకృత్యం గా మారాయి. పట్టణం నగరపాలక పాలక సంస్థగా రూపాంతరం చెందిన తర్వాత సమస్య జటిలమైంది. సమస్యను తీవ్రంగా పరిగణించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నూతన బస్టాండ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ సహకారంతో రూ.25 కోట్ల నిధులతో నగరంలోని ఎన్నెస్పీ క్యాంప్‌లో బస్టాండ్‌ను నిర్మించారు. రెండేళ్ల క్రితం మంత్రి కేటీఆర్ బస్టాండ్‌ను ప్రారంభించారు. దీంతో నగరవాసుల సమస్యలకు పరిష్కారం లభించింది.
ఖమ్మం నగరపాలక సంస్థతో పాటు మూడు మున్సిపాలిటీలు, 589 గ్రామ పంచాయతీల్లో పల్లె, పట్టణ ప్రగతి పథకం విజయవంతమైంది. ప్రతి పట్టణం, గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం అందుబాటులోకి వచ్చింది. పారిశుధ్య పనులు, చెత్తను తరలించేంపదకు ట్రాక్టర్, హరితహారం, అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలకు నీరు పెట్టేందుకు ట్యాంకర్ సమకూరాయి. వాలిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి వచ్చాయి.