రోడ్డు భద్రత సమీక్ష సమావేశం
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు పాటించాలి.
జిల్లా యస్.పి కె.అపూర్వ రావు ఐపిఎస్
నల్లగొండ సాక్షిత ప్రతినిధి
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా యస్ పి అపూర్వరావు కోరారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ కొరకు నేషనల్ హైవే,స్టేట్ హైవేల పైన బ్లాక్ స్పాట్స్ వద్ద తీసుకోవలసిన తక్షణ చర్యలు మొదలగు అంశాలపై జిల్లా యస్.పి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా యస్.పి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ ఒక్కరు చర్యలు తీసుకోవాలని ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే యాక్సిడెంట్ ఫ్రోన్,బ్లాక్ స్పాట్ ఏరియాలను గుర్తించి వాటి నివారణకు తీసుకోవాల్సిన అంశాలను ప్రణాళిక చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రధాన చౌరస్తాలో రేడియం స్టిక్కర్లతో కలిగిన భారీ కేడ్లను ఏర్పాటు చేయాలని, బ్లాక్ స్పాట్స్ వద్ద మరియు కీలకమైన కూడళ్ళ వద్ద లైటింగ్ పెంచాలని అన్నారు.
స్పీడు నియంత్రణ కోసం మలుపుల దగ్గర సూచికలు, బ్లింకింగ్ లైట్స్, బోలర్స్ ఏర్పాటు చేయాలన్నారు. రాత్రి సమయంలో రహదారిపై వాహనాలు నిలిపి ఉండడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ రోడ్డుపై ఎలాంటి వాహనాలు నిలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాహన దారులకు ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల అవగాహన కల్పించి రోడ్డు భద్రత పట్ల చైతన్య పరచాలని తెలిపారు. ప్రమాదాల నివారణ కొరకు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని తగిన నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొబేషనరీ ఐపీఎస్ శేషాద్రిని రెడ్డి,నల్లగొండ డిఎస్పీ నరసింహ రెడ్డి, మిర్యాలగూడ డిఎస్పీ వెంకటగిరి,దేవరకొండ డిఎస్పీ నాగేశ్వర రావు, డి.సి.ఆర్.బి రమేష్, సిఐలు, యస్. ఐ లు పాల్గొన్నారు.