చిట్యాల సాక్షిత ప్రతినిధి
నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా సి.సి రోడ్ల నిర్మాణం పనులు చేపట్టిన కాంట్రాక్టర్ బిల్లులు నిలిపి వేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య లు డిమాండ్ చేశారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం గ్రామంలో ఇటీవల వేసిన సి.సి రోడ్ల నిర్మాణం పనులు నాడు సిపిఎం మండల బృందం పరిశీలించింది. యుఎఫ్ఐడిసి కింద చిట్యాల మున్సిపాలిటీకి మంజూరైన 3 కోట్ల రూపాయల ద్వారా వివిధ వార్డులలో సి.సి.రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం పనులు చేయవలసి ఉండగా, శివనేనిగూడెం (1),వెంకటాపురం (6)వ వార్డ్ ల యందు చేపట్టిన సి.సి రోడ్ల నిర్మాణం పనులు నిబంధనలు ఖాతరు చేయకుండా వేయటం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు. ఇసుకతో కాకుండా డ్రస్ట్ (కంకర పొడి) కలిపి సిమెంట్ రోడ్డు వేశారని అన్నారు.
రోడ్ల నిర్మాణం పనులు సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకుండా జరుగటం వలన సరైన వాటర్ క్యూరింగ్ కూడా జరగకపోవటం వలన ఎగుడుదిగుడుగా వేశారని, అప్పుడే రోడ్డు పగుళ్లు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన ఈ పనులను ఉన్నతాధికారులు పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా జరిగిన ఈ పనుల యం బి రికార్డులను నిలిపి ప్రభుత్వ,ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాజకీయాలకు అతీతంగా ప్రజలను సమీకరించి ఆందోళన చేపట్టనున్నట్టు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు నారబోయిన శ్రీనివాసులు, బొబ్బిలి సుధాకర్ రెడ్డి, గ్రామ శాఖ నాయకులు చొప్పరి లింగయ్య, పాలమాకుల అర్జున్, పోతులూరి, వెంకటాచారి, నరసింహ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.