SAKSHITHA NEWS

సహనానికి ప్రతీక రంజాన్

తెలంగాణలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం

లౌకిక వాదంలో కేసీఆర్ దేశానికే ఆదర్శం

పండుగలు జీవన స్రవంతిలో భాగం

అల్లా అనుగ్రహం, ఆశీస్సులు అందరిపై ఉండాలి

అంతా సుఖ,శాంతులతో జీవించాలి

ముస్లిం సంక్షేమానికి తెలంగాణా ప్రభుత్వం పెద్దపీట

ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముస్లిం సోదరీ, సోదరీ మణులందరికీ బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లా అనుగ్రహం, ఆశీస్సులు ప్రతి ఒక్కరికీ ఎల్లవేళలా ఉండాలని, వారు జీవితాలను సుఖ శాంతులతో ఆనందంగా, ఉల్లాసంగా గడపాలని నామ ఆకాంక్షించారు. కోరుకున్న వాటినన్నింటిని వారికి అల్లా ప్రసాదించి, అందరి జీవితాల్లో సుఖ, సంతోషాలు,వెలుగులు నింపాలన్నారు. పండుగలు మన జీవన ప్రవంతిలో ఒక భాగమై, జాతీయతకు, సంస్కృతి వికాసానికి దోహదం చేస్తున్నాయని అన్నారు. ఏ పండుగ అయినా మానవాళికి హితాన్నే భోదిస్తుందన్నారు. ప్రతి పండుగ వెనుకా ఒక పరమార్ధం దాగి ఉంటుందని, మనిషికి క్రమశిక్షణ నేర్పి, ధర్మాన్ని, దయాగుణాన్ని ప్రబోధించేవే పండుగలన్నారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ పండుగ మంచి హితాన్ని మానవాళికి అందిస్తుందన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం అన్నారు. సహనానికి ప్రతీక రంజాన్ మాసం అని నామ అన్నారు. కరుణ, దాతృత్వం, క్రమశిక్షణ, నిజాయతీ, నిస్వార్ధత, సహనం వంటి వాటి గురించి ఇస్లాంలో ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. లౌకికవాదాన్ని కాపాడడంలో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. తెలంగాణ రాష్ట్రం నేడు మత సామరస్యానికి, గంగా జమున తహజీబ్ కు వేదికగా నిలిచిందన్నారు. సర్వ మతాల సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందర్నీ సమానంగా గౌరవించి, ఆదరిస్తుందన్నారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తుందన్నారు.
పేద ముస్లిం మహిళలు స్వశక్తితో ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు పండుగ కానుకగా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా కుట్టుమిషన్లు అందజేస్తుందన్నారు. సాధిముబారక్ పథకం ఒక చరిత్ర అన్నారు. మైనార్టీల కోసం ప్రత్యేకించి, గురుకులాలు ఏర్పాటు చేసిందన్నారు. విదేశీ విద్యలో భాగంగా రూ.20 లక్షల గ్రాంట్ ను అందిస్తుందన్నారు. అంతేకాకుండా మసీదుల్లో తోఫా గిఫ్ట్ ప్యాకెట్లను అందించడం జరిగిందన్నారు. రంజాన్ పండుగ మానవులకు మార్గదర్శకం చేయడంతో పాటు సత్యాన్ని బోధి స్తుందన్నారు .పవిత్ర ఖురాన్ నిర్దేశించిన జీవన విధానాన్ని గడపడం ప్రధాన విధి అన్నారు. రంజాన్ పండుగ ముస్లింలలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తుందన్నారు. ముస్లింలు సూర్యోదయం నుంచి సూర్యస్తమయం వరకు నీరు, ఆహారం, కనీసం ఉమ్మి కూడా మింగకుండా కఠోర ఉపవాస దీక్షలు ఆచరించడం ఎంతో అభినందనీయమన్నారు. రంజాన్ మాసంలో నమాజ్కు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. మసీదు వెళ్లలేని వారు సైతం ఉన్న స్థలాన్నే శుభ్రం చేసుకుని, ప్రార్ధన చేసి, భగవంతుడి కృపకు పాత్రులవుతారని అన్నారు. మానవీయ విలువలను తెలియజేసే పవిత్ర ఖురాన్ గ్రంధం ఎన్నో నైతిక విలువలను మానవాళికి నేర్పుతుందని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.


SAKSHITHA NEWS