SAKSHITHA NEWS

రబీ ధాన్యం సేకరణకు పూర్తిస్ధాయిలో సన్నద్ధం కావాలి …

జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు .

ఏలూరు, ఏప్రిల్,3: రబీ సీజన్ లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు పూర్తిస్ధాయిలో సన్నద్ధం అవ్వాలని జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు అన్నారు.

సోమవారం కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో రబీ ధాన్యం సేకరణ కార్యాచరణ, శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సివిల్ సప్లైయిస్, సహకార, వ్యవసాయ, రవాణాశాఖ, మిల్లర్లు, ట్రాన్స్ పోర్టర్ల , సొసైటీల ప్రతినిధులు తదితరులతో జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు రబీ ధాన్యం సేకరణ ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు మాట్లాడుతూ గత ఖరీఫ్ లో కొత్త విధానం ద్వారా ధాన్యం కొనుగోలును విజయవంతం చేయడంలో సహకరించిన అందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఖరీఫ్ లో గుర్తించిన లోటుపాట్లను సరిచేసుకొని ప్రస్తుత రబీలో రైతులకు మరింత మేలు జరిగేలా ధాన్యం సేకరణ చేపట్టాలన్నారు. జిల్లాలో కొన్నిచోట్ల ఇంకా ధాన్యం కోతలు జరుగుతున్నాయన్నారు. ఈ-పంట నమోదు కూడా పకడ్బందీగా జరిగిందన్నారు. జిల్లాలో 78,996 ఎకరాల్లో ఈ-కేవైసి పూర్తయిందన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్ధితులు దృష్టిలో ఉంచుకొని వరికోతలు కొంత వాయిదా వేసుకోవాలని ఆయన సూచించారు. రబీధాన్యం సేకరణకు అవసరమైన గోనెసంచులు, రవాణా సౌకర్యంపై ఇప్పటినుండే పూర్తిదృష్టి పెట్టాలన్నారు. కనీస మద్దతు ధరకన్నా బహిరంగ మార్కెట్ లో ధర ఎక్కువ లభిస్తే అందుకు రైతులను ప్రోత్సహించాలన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించి డేటా ఆపరేటర్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు పూర్తిస్ధాయి శిక్షణను ఈవారంలో అందించడం జరుగుతుందన్నారు.

సమావేశంలో పాల్గొన్న రైస్ మిల్లర్స్ జిల్లా అధ్యక్షులు ఆళ్ల సతీష్ చౌదరి మాట్లాడుతూ ఖరీఫ్ లో ధాన్యం సేకరణ విజయవంతం అయినందుకు మిల్లర్ల తరపున ధన్యవాదాలు తెలిపారు. ట్రక్ షీట్ జనరేషన్ గోనెసంచులు సరఫరాకు సంబందించి పలు సూచనలు అందజేశారు.

సమావేశంలో పాల్గొన్న వై.ఆర్.కె.పి.ఆర్. బాబ్జి, పలువురు ట్రాన్స్ పోర్టర్లు తదితరులు రబీధాన్యం సేకరణకు సంబందించి పలు విషయాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. రబీ ధాన్యం సేకరణను విజయవంతం చేసేందుకు తామంతా పూర్తి సహకారం అందిస్తామన్నారు.

సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్ష్ రాజేంద్రన్, ఆర్డిఓలు కె. పెంచల కిషోర్, ఝాన్సీరాణి, జిల్లా సహకార అధికారి టి. ప్రవీణ, పౌర సరఫరాల జిల్లా మేనేజరు మంజూ భార్గవి, జిల్లా వ్యవసాయశాఖాధికారి వై. రామకృష్ణ, జిల్లా పౌర సరఫరాల అధికారి సత్యనారాయణరాజు, జిల్లా రవాణా శాఖాధికారి శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA NEWS